అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
హుస్నాబాద్: ‘నా రాజకీయ పరపతిని హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తా.. ప్రగతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా’ నని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 మంది సర్పంచ్‌లకు త్వరలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాలు గెలుచుకున్నారన్నారు. రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. గాంధీజీ కలలు కన్న విధంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కరీంనగర్, జనగామ, అక్కన్నపేట నాలుగు లేన్ల రోడ్, 250 పడకల ఆస్పత్రి, ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
నాగారం గ్రామాన్ని
సుందరంగా తీర్చిదిద్దుతా..
హుస్నాబాద్‌రూరల్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం నాగారంలో కుమారస్వామికి మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగారం గ్రామానికి కావల్సిన అభివృద్ధికి నిధులను ఇస్తామన్నారు. గ్రామానికి మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మహ్మదాపూర్‌లో కాంగ్రెస్ నాయకుడు తౌటు రాజయ్య ఇటీవల మరణించి వారి కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. వీరి వెంట మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు ఉన్నారు.
రాజకీయ పరపతిని వినియోగిస్తా
త్వరలో నూతన సర్పంచ్‌లకు శిక్షణ
మంత్రి పొన్నం ప్రభాకర్


