కార్యకర్తల్లో నయా జోష్
ఎక్కువ చోట్ల బీఆర్‌ఎస్ గెలుపు ● గతం కంటే ఎక్కువ స్థానాలు సాధించిన కాంగ్రెస్
సాక్షి, సిద్దిపేట: ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే అధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందామని బీఆర్‌ఎస్ శ్రేణులు.. గతం కంటే ఎక్కువ సర్పంచ్‌లు గెలిచామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. గురువారం జరిగిన మొదటి విడత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల బలపర్చిన అభ్యర్థులు నువ్వా నేనా? అన్నట్లుగా పోటీ రసవత్తరంగా సాగింది. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, మర్కూక్ మండలాలు, దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని రాయపోలు, దౌల్తాబాద్ మండలాల్లోని 163 సర్పంచ్‌లు, 1,432 వార్డులకు ఎన్నికలు మొదటి విడతలో నిర్వహించారు. అందులో 16 సర్పంచ్‌లు, 224 వార్డులు ఏకగ్రీవం కాగా గురువారం147 సర్పంచ్, 1,208 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో బీఆర్‌ఎస్ బలపర్చినవారు సర్పంచ్‌లుగా 68 మంది, కాంగ్రెస్‌కు చెందిన వారు 59 మంది, బీజేపీ వారు 8, ఇతరులు 12 మంది గెలుపొందారు.
నేతల విస్తృత ప్రచారం
బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల మద్దతుగా ముఖ్యనాయకులు అంతగా ఎవరూ ప్రచారం చేయనప్పటికీ ఆ పార్టీ నాయకులే ఎక్కువగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. మండల నాయకుల సహకారంతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటరును కలిసి గ్రామ అభివృద్ధి ఎజెండాను వివరించి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 46 మంది , దుబ్బాక నియోజకవర్గంలో రెండు మండలాల్లో 22 మంది బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాదించారు.
రెండు, మూడో విడతలపై ప్రభావం
మొదటి విడతలో వచ్చిన ఫలితాలు రెండవ, మూడవ విడతలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల పై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు ప్రచార వేగం పెంచారు. జిల్లాలో అత్యధికంగా సర్పంచ్‌లు గెలుపొందాలని లక్ష్యంగా రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 14న, 17న ఆయా గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏ గ్రామ పంచాయతీలో ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే.
గజ్వేల్‌లో 46 చోట్ల కాంగ్రెస్ గెలుపు
జిల్లా కాంగ్రెస్ పార్టీ(డీసీసీ) అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు ఇద్దరు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 46 సర్పంచ్‌లు గెలుపొందారు. దుబ్బాక నియోజకవర్గంలో రెండు మండలాల్లో 13 కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు సర్పంచ్ పదవులు దక్కాయి. ఈ ఇద్దరు నేతలు వర్గల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందడం గమనార్హం.


