కౌంటింగ్ పకడ్బందీగా చేపట్టాలి
● అధికారుల అనుమతి తర్వాతే
ఫలితాలు వెల్లడించాలి
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ హైమావతి
ములుగు(గజ్వేల్): గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, పై అధికారుల అనుమతితో ఫలితాలను విడుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి సూచించారు. ములుగు మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను ఆమె బుధవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఓ, ఓపీఓలకు బ్యాలెట్ బ్యాక్స్ ఉపయోగించే ప్రక్రియ గురించి ఎలాంటి సందేహాలున్నా మాస్టర్ ట్రైనర్‌లను అడిగి పరిష్కరించుకోవాలని తెలిపారు. పోలింగ్ మెటీరియల్‌తో పోలింగ్ స్టేషన్లకు వెళ్లిన సిబ్బంది ఫర్నిఛర్, బ్యాలెట్ బాక్స్‌లు, ఆయా మెటీరియల్‌ను సరిచేసుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ తప్పనిసరిగా ఉదయం 7 గంటలకు మొదలు పెట్టాలన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలపాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని, ఆతరువాతే బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిచాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోకి ఏజెంట్లు, పోలింగ్ సిబ్బందికి ఫోన్‌ల అనుమతి లేదన్నారు. ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు పంచాయతీ కార్యదర్శులు సమకూరుస్తారని తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అందరూ సహకరించాలి
గజ్వేల్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం గజ్వేల్ ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గజ్వేల్, దుబ్బాక నియోజకర్గాల్లోని 147 సర్పంచ్ స్థానాలు, మరో 1208 వార్డు సభ్యుల స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరుగుతోందని చెప్పారు. 33 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, ఇందులో 5 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మిగిలిన చోట మైక్రోఅబ్జర్వర్ల నిఘా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలన్నారు. ఓటర్లు ఓటు వేయడానికి వచ్చే సందర్భాల్లో తమ వెంట తప్పనిసరిగా గుర్తింపుకార్డును తెచ్చుకోవాలన్నారు. నిబంధనలు పాటించకతప్పకపోతే చర్యలు తప్పవన్నారు.


