లిక్కర్ లక్కు ఎవరికో?
నేడే మద్యం దుకాణాల లక్కీ డ్రా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు 93 మద్యం దుకాణాలు.. 2,782 దరఖాస్తులు
మద్యం దుకాణాల దరఖాస్తుదారుల్లో టెన్షన్ నెలకొంది. లిక్కర్ లక్కు ఎవరిని వరిస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు. మద్యం నూతన పాలసీ (2025–27) ప్రకారం వైన్ షాపుల నిర్వహణలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని సీసీ గార్డెన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతితో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా టెండర్‌దారుల్లో కొందరు దుకాణాలు తమకే దక్కాలంటూ ఆలయాల్లో పూజలు చేయడం విశేషం.
సిద్దిపేటకమాన్: జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు 2,782 దరఖాస్తులు వచ్చాయి. టెండర్‌కు ఫీజు (నాన్ రిఫండబుల్) రూ.2 లక్షల నుంచి ఈ సారి రూ.3లక్షలకు పెంచడంతో ఆశించిన మేర అప్లికేషన్లు రాలేదు. ప్రస్తుత పాలసీ ప్రకారం వచ్చిన మొత్తం 2,782 దరఖాస్తులతో రూ.83.46కోట్ల ఆదాయం సమకూరింది. గత పాలసీ ప్రకారం 4,166 దరఖాస్తులు రాగా రూ.83.32 కోట్ల ఆదాయం సమకూరింది. గత పాలసీ కంటే ఈసారి రూ.14లక్షల ఆదాయం అధికంగా వచ్చింది. అన్ని మద్యం దుకాణాలకు పదుల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రాలో ఎవరికి వైన్ షాప్‌లు దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అత్యధికంగా తీగుల్ నర్సాపూర్‌లోని ఎస్‌డీపీ 51వ షాప్‌నకు 73 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు.
పాస్ ఉన్న వారికే అనుమతి
కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న లక్కీ డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. టెండర్‌దారులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు భారీ సంఖ్యలో డ్రా నిర్వహించే ప్రదేశానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కరీంనగర్ రోడ్డులోని సీసీ గార్డెన్‌లో ఏర్పాట్లు చేశారు. పాస్ ఉన్న వారిని మాత్రమే అధికారులు లోపలికి అనుమతించనున్నారు. ఇప్పటికే టెండర్ దారులకు జారీ చేసిన పాస్‌లతో ఉదయం 10గంటల్లోపు రావాలని అధికారులు తెలిపారు. లక్కీ డ్రా మొత్తం వీడియో రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే మద్యం దుకాణాలు డ్రాలో తమకే మద్యం దుకాణాలు దక్కాలని జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి, కొండపోచమ్మ ఆలయాల్లో దరఖాస్తుదారులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దరఖాస్తుదారుల్లో టెన్షన్
ఏర్పాట్లు పూర్తి
సిద్దిపేట పట్టణం సీసీ గార్డెన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నాం. దరఖాస్తుదారులకు జారీ చేసిన పాస్ ఉన్న వారిని లోపలికి అనుమతిస్తాం. పూర్తి పారదర్శకంగా డ్రా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం.
– శ్రీనివాసమూర్తి,
ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సిద్దిపేట
లిక్కర్ లక్కు ఎవరికో?
లిక్కర్ లక్కు ఎవరికో?


