రాయితీకి రాంరాం!
● సరఫరా కానీ సబ్సిడీ టార్పాలిన్లు ● ప్రైవేటులో కొనుగోలు చేస్తున్న రైతులు
అద్దెకు తీసుకుంటున్నాం..
పంటల సీజన్‌లో టార్పాలిన్లు అద్దెకు తీసుకుంటున్నాం. గతంలో మాదిరిగా ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలి. ప్రవేటులో కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారమవుతోంది.
– లక్ష్మణ్, రైతు చిన్నకోడూరు
చిన్నకోడూరు(సిద్దిపేట): పండించిన పంటలను వర్షాల నుంచి కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్ కవర్లు అందించేది. ఆరేళ్లుగా ప్రభుత్వం టార్పాలిన్లపై సబ్సిడీని నిలిపివేసింది. దీంతో వర్షాలు కురుస్తున్నప్పుడు చేతికి అందివచ్చిన పంటలను నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
గతంలో రూ.1,250కే..
గతంలో ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్ కవర్లను రూ.1,250కి అందజేసింది. తర్వాత ఈ పథకాన్ని వ్యవసాయ శాఖకు బదిలీ చేసింది. కొన్నేళ్లు రైతులకు సబ్సిడీపై కవర్లు పంపిణీ చేశారు. ఆరేళ్లుగా కవర్ల పంపిణీ నిలిపివేశారు. దీంతో చేసేదిలేక రైతులు సొంత ఖర్చులతో ఒక్కో టార్పాలిన్‌కు రూ.3 వేలు వరకు వెచ్చించి ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా భారం కావడంతో రైతులు అద్దే టార్పాలిన్ కవర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.


