సైక్లింగ్‌తో ఉజ్వల భవిష్యత్తు
సిద్దిపేటజోన్: సైక్లింగ్‌తో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్య, రూరల్ సీఐ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగిన 20వ జిల్లా స్థాయి సైకిల్ పోటీల ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం సైకిల్ సాధన చేయడంతో లాభాలు ఉంటాయన్నారు. సైక్లింగ్ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈనెల 31, నవంబర్ 1, 2వ తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, పాఠశాల క్రీడా సమాఖ్య మాజీ కార్యదర్శి సుజాత, క్రీడా సంఘాల కార్యదర్శులు ఉప్పలయ్య, ఖేల్ ఇండియా సైక్లింగ్ కోచ్ సంజీవ్, సీనియర్ క్రీడాకారులు విజయ్, రమేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


