కొమురవెల్లిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

కొమురవెల్లిలో భక్తుల సందడి

Oct 27 2025 8:52 AM | Updated on Oct 27 2025 8:52 AM

కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లి (సిద్దిపేట): మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు మొదట స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత మంది గంగిరేణు చెట్టు ప్రాంగణంలో పట్నాలు వేసి, ముడుపులు కట్టారు. మరికొంత మంది అభిషేకాలు, కల్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్‌, ఏఈఓ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు.

ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దు

డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి

కొండపాక(గజ్వేల్‌): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కుకునూరుపల్లిలో ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ గింజకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏ గ్రేడ్‌ క్వింటాల్‌ ధర రూ.2,389, కామన్‌ గ్రేడ్‌ ధర రూ.2,369లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. మార్కెట్‌కు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు తాలు, తేమ శాతం లేకుండా చూసుకొని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి. పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అమరేందర్‌, నాయకులు పాల్గొన్నారు.

కోర్టు పరిధిలోనే

ఏర్పాటు చేయండి

హుస్నాబాద్‌: కోర్టు పరిధిలోనే సబ్‌ కోర్టు నిర్మించాలని, కోర్టు తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పునరాలోచన చేయాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌గౌడ్‌ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఐఓసీ భవనాన్ని పట్టణానికి దూరంగా కిషన్‌నగర్‌లో నిర్మించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సబ్‌ కోర్టును పందిల్ల, జిల్లెల్లగడ్డలో నిర్మించాలని స్థల పరిశీలన చేశారని, కోర్టు పరిధిలోనే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు వెల్పుల రాజు, నరేష్‌ తదితరులు ఉన్నారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించండి

సిద్దిపేటఅర్బన్‌: మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో నవంబర్‌ ఒకటి నుంచి వంట బంద్‌ చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి హెచ్చరించారు. ఆదివారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ జిల్లా నాలుగవ మహాసభలో పాల్గొని మాట్లాడారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు అప్పుల పాలయ్యారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్లకు, కూరగాయలకు అదనంగా రేట్లు పెంచి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్‌, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ అధ్యక్షురాలు రాజమణి, ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement