వసూల్‌రాజాల ఇష్టారాజ్యం
● దళారులు, పైరవీకారులకు అడ్డాగా తహశీల్దార్ కార్యాలయం ● పని కావాలంటే చేయి తడపాల్సిందేనంటున్న సిబ్బంది ● రిజిస్ట్రేషన్‌కోసం వెళ్తే 20 రోజులుగా తిప్పుతున్న వైనం ● అవినీతి జలగలపై చర్యలు తీసుకోవాలంటున్న రైతులు
పని కావాలంటే పైసలివ్వాల్సిందే
కార్యాలయంలో ఏ పని కావాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిందే. చిన్నస్థాయి నుంచి ఉద్యోగి నుంచి ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్‌తోపాటు సర్వేయర్, తహసీల్దార్ వరకు వసూల్ రాజాలే. మీ సేవాలో స్లాట్ బుక్ చేసుకున్నాక నిబంధనల ప్రకారం ఆర్‌ఐ రిపోర్ట్ రాశాక తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ, రైతుల దగ్గర నుంచి ఎకరాకు రూ.30 వేల నుంచి 50 వేల వరకు, చిన్న రైతులు అయితే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో రిజిస్ట్రేషన్ డ్యాక్యుమెంట్‌కు రూ.1000 నుంచి రూ.2వేల వరకు కంప్యూటర్ ఆపరేటర్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కోహెడరూరల్(హుస్నాబాద్): కోహెడ తహశీల్దార్ కార్యాలయం దళారులకు, పైరవీకారులకు అడ్డాగా మారింది. పనుల కోసం వచ్చే రైతులను, సామాన్యులను సైతం సిబ్బంది వదలడం లేదు. పనికావాలంటే సిబ్బంది చేయి తడపాల్సిందేనని సిబ్బంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికితోడు ఇటీవలే ఇక్కడకు బదిలీపై వచ్చిన తహశీల్దార్ చంద్రశేఖర్ వ్యవహారశైలి కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
కుల, ఆదాయ ధ్రువ పత్రాల నుంచి మొదలై భూమి రిజిస్ట్రేషన్ వరకు డిమాండ్‌ను బట్టి కోహెడ తహసీల్దార్ కార్యాలయంలో పైసలు వసూలు చేస్తున్నారు. ముడుపులిస్తేనే పనులు సాధ్యం అనే తరహాలో ఇక్కడ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని మరీ దందాలు నడిపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. భూముల విషయంలో స్థానికంగా ఉన్న భూ భారతి కంప్యూటర్ ఆపరేటర్ తహశీల్దార్‌కు కీలకంగా మారడంతో ఇక్కడ అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తహశీల్దార్‌ను కలవడానికి వెళ్లాలంటే ముందు పైరవీకారులను, దళారులను కలిశాకే సాధ్యమవుతోందని సామాన్యులు వాపోతున్నారు.
స్లాట్ బుక్ చేసినా...
స్లాట్ బుక్ చేస్తే కూడా డబ్బులు తీసుకోనిదే రిజిస్ట్రేషన్ చేయడం లేదు. 15 రోజులుగా సుమారు 20కి పైగా స్లాట్‌లు బుక్ చేసినా రిజిస్ట్రేషన్, పౌతి చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. ఎందుకని బాధితులు అడిగితే ఏదో కారణం చెప్పి తిప్పి పంపించివేస్తున్నారు.
మొదటి నుంచి వివాదాస్పదమే
బెజ్జంకి మండలం నుంచి బదిలీపై వచ్చిన తహశీల్దార్ మొదటి నుంచి వివాదాస్పదమే. ఆయన వ్యవహార శైలితో కిందిస్థాయి ఉద్యోగులతోపాటు కార్యాలయానికి వచ్చే బాధితులు కూడా విమర్శలు చేసేవారు. మధ్యవర్తులను పెట్టుకుని చేయి తడిపితేనే కార్యాలయంలో పనులు చేసేవారని ఈయనపై ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు బెజ్జంకి మండలానికి చెందిన పలువురు ఫిర్యాదు చేయడంతో 20 రోజుల క్రితం బదిలీపై కోహెడకు వచ్చారు. వచ్చిన రోజు నుంచే రోజుల తరబడి పెండింగ్‌లో పెట్టి తహశీల్దార్ రైతులను ఇబ్బందులు పెడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేసి కోహెడ నుంచి సదరు అవినీతి అధికారిని తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. కాగా, ఈ విషయంపై తహశీల్దార్ చంద్రశేఖర్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించేందుకు వారం నుంచి ప్రయత్నిస్తున్నా అస్సలు స్పందించడమే లేదు. దీంతో భూ భారతి ఆపరేటర్ స్వామిని వివరణ కోరగా రిజిస్ట్రేషన్ విషయాలు తహశీల్దార్‌నే అడగాలని తనకేమీ తెలియదని బదులిచ్చాడు.
18 రోజులుగా తిరుగుతున్నాం
మీ సేవాలో ఈ నెల 7న రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్ బుక్ చేశాం. ప్రతీ రోజు కార్యాలయంలో సంప్రదిస్తున్నాం. కానీ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ కోసం రుసుము కూడా చెల్లించాం. కానీ, కార్యాలయంలో పనులు కావడం లేదు. ప్రతీ రోజు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నాం కానీ పని కావడం లేదు. చిన్న చిన్న కారణాలు చెప్పి పనులు పెండింగ్‌లో పెడుతున్నారు.
–పేర్యల సాగర్‌రావు, రియల్టర్, కోహెడ మండలం
వసూల్‌రాజాల ఇష్టారాజ్యం


