లఘు, ఛాయాచిత్రాల పోటీలకు ఆహ్వానం
సిద్దిపేటకమాన్: పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫొటోలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా లఘు చిత్రాలు (షార్ట్ ఫిలిమ్స్) తీసి పంపించాలని సీపీ విజయ్‌కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఫొటోలు, వీడియోలు ఈనెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో పంపించాలని తెలిపారు. ప్రతిభ కనబర్చిన మొదటి మూడు ఫొటోలు, వీడియోలకు బహుమతులు ఉంటాయని వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని తెలిపారు.
గ్రామాల్లో
పోలీసుల సందర్శన
సిద్దిపేటకమాన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 27, 28వ తేదీల్లో కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శిస్తారని పోలీసు కమిషనర్ వెల్లడించారు. పోలీసు అధికారులు గ్రామాలను సందర్శించినపుడు ప్రజాసమస్యలేమైనా ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. పరిష్కరించగలిగే వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తారని, ఇతర డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన సమస్యలుంటే సంబంధిత శాఖలకు నివేదిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు.
వర్షాలకు చీడ పీడలు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వరి పంటకు చీడ పీడలు ఆశిస్తాయని, వాటి నివారణకు వరి మడుల్లో కాలువలు చేసి నీటిని నిల్వ లేకుండా చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి సూచించారు. మండల పరిధిలోని చౌడారం, మేడిపల్లి గ్రామాల్లో శనివారం వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ...పాల దశలో ఉన్నటువంటి వరిని కంకినల్లి ఆశించే అవకాశం ఉన్నందువల్ల స్పైరోమెసిఫెస్ 1 మిల్లీ లీటర్, లీటర్ నీళ్లలో కలిసి పిచికారీ చేయాలన్నారు. రైతులు వరి, మొక్కజొన్న కోసిన తర్వాత కొయ్యకాలు కాల్చవద్దన్నారు. ఆమె వెంట ఏఓ జయంత్ కుమార్, ఏఈఓలు, రైతులున్నారు.
సరైన పద్ధతిలో
నడిపించేది తల్లే
ఘనంగా సప్తశక్తి సంఘం–మాతృ సమ్మేళనం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మనం ఎంత అభివృద్ధి సాధించిన కుటుంబాన్ని సరైన పద్ధతిలో నడిపించే శక్తి ఆ కుటుంబంలోని తల్లికే ఉందని, మాతృమండలి కార్యదర్శి నీరటి నాగమణి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో శనివారం ఘనంగా సప్తశక్తి సంఘం–మాతృ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాటలు, మహిళా స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనలు, క్విజ్ కాంపిటీషన్, ప్రసంగాలతో కార్యక్రమం సందడిగా కొనసాగింది. వివిధ పోటీల్లో విజయం సాధించిన మహిళలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
కళాప్రదర్శనను
విజయవంతం చేయండి
గజ్వేల్‌రూరల్: సంచార జాతుల కళాప్రదర్శనను విజయవంతం చేయాలని సామాజిక సామరస్యతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేశ్‌బాబు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి, సామాజిక సామరస్యతా వేదిక ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో ఆదివారం సంస్కృతి, విలువలను అందించే సంచార జాతుల కళా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. సంచార జాతుల కళలు సమాజ చైతన్యానికి ఉపయోగపడ్డాయని, వీటిని భవిష్యత్ తరాలకు తెలిపేవిధంగా కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
లఘు, ఛాయాచిత్రాల పోటీలకు ఆహ్వానం


