ధాన్యం.. దైన్యం
దంచికొట్టిన వాన
● దుబ్బాక మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యం ● వరదలో కొట్టుకుపోయిన వైనం ● కాపాడుకునేందుకు రైతుల పాట్లు
దుబ్బాక: దుబ్బాక పట్టణంతోపాటుగా పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. ఎండిన ధాన్యంసైతం వర్షానికి తడిసిపోవడంతో రైతులు కన్నీరుపెట్టడం తప్ప ఏం చేయలేని పరిస్థితి దాపురించింది.
దుబ్బాక మార్కెట్ యార్డులో వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం తడిసిముద్దయింది. వర్షం దంచికొట్టడంతో ఆర బెట్టిన ధాన్యంతోపాటు కుప్పల కిందినుంచి వరద పెద్ద ఎత్తున రావడంతో వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు దుబ్బాక మార్కెట్‌యార్డులో వర్షంలోనే రైతులు పడరానిపాట్లు పడ్డారు. ఎండిన ధాన్యం సైతం వర్షంలో తడిసిపోవడం, కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం ధాన్యం కుప్పలమీద కప్పుకుందామంటే కూడా కవర్లు కూడా లేక పోవడంతో చాలామంది రైతుల ధాన్యం కొట్టుకుపోయింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు సరిపడా కవర్లు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
ధాన్యం.. దైన్యం


