ఇంటర్ ఉత్తీర్ణత పెంచాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల కళాశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సిలబస్, బోధన తదితర అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమంతప్పకుండా కళాశాలకు హాజరుకావాలని సూచించారు. అనంతరం రిజిస్టర్‌లను పరిశీలించి, అధ్యాపకులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ మూడు నెలలు విద్యార్థులకు ఎంతో కీలకమని స్టడీ అవర్‌లను నిర్వహించాలని సూచించారు. ప్రతీ విద్యార్థి కళాశాలకు హాజరయ్యేలా వారి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. వెనుకబడిన విద్యారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, అధ్యాపకులు పాల్గొన్నారు.


