
కేర్ నామమాత్రం.. సేవలు తూతూమంత్రం
అస్తవ్యస్తంగా ప్యాలియేటివ్ కేర్
● క్యాన్సర్ రోగులకు కానరాని సాంత్వన ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో దుస్థితి
గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని ప్యాలియేటివ్ కేర్ సెంటర్ సేవలు నామమాత్రంగా మారాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులకు సాంత్వన కరువైంది. ఇన్ పేషంట్లకు మొక్కుబడి వైద్యం అందుతోంది. మందుల కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. సిబ్బంది కొరత కారణంగా ‘హోమ్ కేర్’ సేవలు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నా పాలకులకు పట్టడంలేదు. –గజ్వేల్
క్యాన్సర్ బాధితులను అక్కున చేర్చుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం 2017లో రాష్ట్రంలోని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ప్యాలియేటివ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత గజ్వేల్‌తో పాటు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, చౌటుప్పల్, వరంగల్, జనగామ, ఖమ్మం ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో వైద్యుడు, ఫిజియోథెరపిస్టు, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, నలుగురు ఆయాలు, హోమ్‌కేర్ ట్రీట్‌మెంట్ వాహనానికి సంబంధించి డ్రైవర్‌ను నియమించారు. వీరికి అవసరమైన మందులు, ఇతర ఖర్చుల బడ్జెట్‌ను కేటాయింపులు జరిపారు. ఈ బృందం 2018 మే నెల నుంచి 2019 జనవరి 31వరకు తమతమ కేంద్రాల పరిధిలోని 40 కిలోమీటర్ల వ్యవధిలో ఇంటింటి సర్వే జరిపింది. ఈ విధంగా గుర్తించిన అవసానదశ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను వెంటనే కేంద్రాల్లో చేర్పించుకొని నొప్పి నివారణ, మందులు ఇస్తూ వారు నిత్యం శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండేలా కౌన్సెలింగ్ చేస్తూ ఊరటనివ్వాల్సి ఉంది. నిత్యం ఉదయం వేళల్లో పాలు, బ్రెడ్డు, మధ్యాహ్నం పోషకాలతో కూడిన భోజనం, రాత్రి వేళలో భోజనం అందించాలి. ప్యాలియేటివ్ కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న వారికి అత్యవసరంగా కీమో థెరపి, రేడియో థెరపి అవసరముంటే సమీపంలో ఉండే ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రులకు తరలించాలి. వీరితో పాటు హోమ్‌కేర్ ట్రీట్‌మెంట్‌సైతం నిర్వహించాలి. ఆసుపత్రుల్లో చేరి చికిత్స చేయించుకోలేక ఇంటి వద్దే ఉంటున్న వారిని తరచూ కలుస్తూ వైద్యం అందిస్తూ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయాలి. కానీ ప్యాలియేటివ్ సెంటర్లలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నా అధికారులు దృష్టిసారించకపోవడం గమనార్హం.

కేర్ నామమాత్రం.. సేవలు తూతూమంత్రం