
పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి
సీపీ విజయ్‌కుమార్
అమరవీరులకు ఘననివాళి
సిద్దిపేటకమాన్: పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని, అమరులైన పోలీస్ కుటుంబాలకు పోలీస్‌శాఖ, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటుందని సీపీ విజయ్‌కుమార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్తూపం వద్ద సీపీ, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్‌ఎస్‌ఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో గౌరవ వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులు యాదగిరి (సీఐ), జాన్‌విల్సన్ (ఎస్‌ఐ), రాజగోపాలచారి (ఎస్‌ఐ), చంద్రయ్య (హెడ్ కానిస్టేబుల్), కానిస్టేబుళ్లు రామ్మూర్తి, ప్రకాశ్‌సింగ్‌లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా నిలుస్తామని తెలిపారు. ప్రజలకు సంక్షేమానికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని అన్నారు. ఈ నెల 31వరకు పోలీస్‌స్టేషన్లలో ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సీపీ అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. అమరుడైన ప్రకాశ్‌సింగ్ భార్య కౌసల్య తన భర్తను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకోగా సీపీ.. అతడి సేవలను కొనియాడుతూ ఆమెను ఓదార్చారు. అమరులైన 191 మంది అధికారులు, సిబ్బంది పేర్లను అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ చదివి వినిపించారు.

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి