
కలెక్టర్ ఇంట్లో ఆత్మీయ అతిథులు
మెడికల్ ఆఫీసర్‌పై ఆగ్రహం
● బాలసదనం పిల్లలతో పండుగ సంబరాలు ● స్వయంగా వండి, వడ్డించిన హైమావతి
సిద్దిపేటజోన్: కలెక్టర్ ఇంట్లో ఆత్మీయుల సందడి.. పండుగ వేళ కలెక్టరే స్వయంగా వంటలు వండి, వడ్డించారు. వారితో కలిసి పండుగ సంబరాలు నిర్వహించారు. ఇంతకీ వారెవరనే కదా.. మీ సందేహం.. వారేనండి బాల సదనం పిల్లలు.. జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పిల్లల అవాస కేంద్రం బాలసదనం సందర్శించారు. అక్కడి పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు. దీపావళి పండుగను వారితో కలిసి జరుపుకోవాలని నిర్ణయించారు. వెంటనే వారిని ఇంటికి ఆహ్వానించారు. ఈ మేరకు కలెక్టర్ హైమావతి దీపావళి రోజున తన ఇంట్లో బాలసదనం పిల్లలతో సంబురాలను ఆనందంగా నిర్వహించారు. ముందుగా పిల్లలతో కలిసి లక్ష్మీ పూజ నిర్వహించి హారతి అందజేశారు. పిల్లలకు ఇష్టమైన పులిహోర, సేమియా, అన్నం, కూరలు చేసి దగ్గరుండి వడ్డించారు. అనంతరం పిల్లలతో కలిసి క్యాంపు కార్యాలయంలో బాణాసంచా కాల్చారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు దీపావళి పండుగ రోజు కలెక్టర్ దేవుడిచ్చిన అమ్మలా ఆదరించారు. దీంతో పిల్లల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
సిద్దిపేటరూరల్: విధులను నిర్లక్ష్యంగా నిర్వర్తిస్తున్న నారాయణరావుపేట మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. రిజిస్టర్‌లో సంతకం చేసి ఆస్పత్రిలో వైద్యాధికారి బాపురెడ్డి లేకపోవడంతో ఆరా తీశారు. తరుచూ విధులకు గైర్హాజరవుతున్నారని తెలియడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఫోన్ ద్వారా ఆదేశించారు. వృత్తికి న్యాయం చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పొద్దుతిరుగుడుకు అక్కన్నపేట అనుకూలం
అక్కన్నపేట(హుస్నాబాద్): నూనె గింజల సాగును పెంపొందించడానికి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కొన్ని ప్రాంతాలు గుర్తించారని, అందులో అక్కన్నపేట మండల ప్రాంతం అనువైనదిగా భావించి ఎంపిక చేశారని కలెక్టర్ హైమావతి తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం జాతీయ నూనె గింజల పథకం పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వంద శాతం సబ్సిడీతో మండలంలో 253మంది రైతులకు 500 ఎకరాలు సాగు చేసేందుకు పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతులు పంట మార్పిడి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ ఇంట్లో ఆత్మీయ అతిథులు