
ఊరూరా ఉపాధి గుర్తింపు
● నవంబర్ 30 వరకు గ్రామసభలు ● 30లక్షల పని దినాలు లక్ష్యం ● జిల్లా యంత్రాంగం చర్యలు
సిద్దిపేటరూరల్: ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనులు కల్పించేందుకు, జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నెల మొదటి వారం నుంచే గ్రామసభల ద్వారా పనులను గుర్తించాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కొత్త పనుల గుర్తింపునకు ఆలస్యం ఏర్పడింది. ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో గ్రామసభల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనుల గుర్తింపునకు గ్రామసభలను నిర్వహిస్తున్నారు.
గ్రామసభల కీలకపాత్ర
ప్రభుత్వ నిబంధనల మేరకు నవంబర్ 30వ తేదీ వరకు పంచాయతీల్లో ఉపాధి గ్రామసభలు నిర్వహించనున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి పనులు చేపట్టేందుకు గ్రామసభలు కీలకపాత్ర వహించనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం 58 రకాల పనులు గుర్తిస్తున్నారు. గ్రామసభలను పూర్తి చేసి అందులో గుర్తించిన పనులను మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు పంపి అనుమతి పొందనున్నారు. జిల్లా ఉన్నతాధికారుల అనుమతుల మేరకు కొత్తగా గుర్తించిన పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తారు.
ప్రాధాన్యత మేరకు..
జిల్లాలోని మండలాల వారీగా ఉపాధి హామీ పనులతో పాటు భూగర్భ జలాలవృద్ధి, పాంపాండ్స్, మ్యాజిక్ సోప్ పిట్స్. కమ్యూనిటీ సోక్‌పిట్స్, నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు, చెరువులు, కాల్వల్లో పూడికతీత వివిధ రకాల వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పనులను నమోదు చేసుకోనున్నారు. ఎక్కువ మొత్తంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన పనులు వారి సమ్మతితోనే గుర్తించి చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.
పని కల్పించేందుకు చర్యలు
కూలీలకు పనులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామసభలు నిర్వహించి పనులను గుర్తిస్తాం. వచ్చే నెల వరకు గ్రామసభలు నిర్వహిస్తాం. గుర్తించిన పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపడతాం. కూలీలకు పనితో పాటు నిర్దేశించిన రోజువారి కూలి డబ్బులు అందిస్తాం. జయదేవ్‌ఆర్యా,
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

ఊరూరా ఉపాధి గుర్తింపు