
నిధులు రాక.. పనులు సాగక
టీయూఎఫ్‌ఐడీసీ నిధుల వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలకు రూ.15కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రధాన మున్సిపాలిటీలు సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌కు నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. దీంతో ఏళ్లతరబడి నిలిచిన పనులకు మోక్షం కలగడంలేదు.
గజ్వేల్: మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా టీయూఎఫ్‌ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా ప్రతి మున్సిపాలిటీకి రూ.15కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను గత జూలై నెలలో పంపగా.. ఆమోదించి ఇటీవల విడుదల చేశారు. కానీ జిల్లాలో ఈ నిధుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. పనుల ప్రారంభానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ప్రధాన మున్సిపాలిటీలైన గజ్వేల్– ప్రజ్ఞాపూర్, సిద్దిపేటలకు నిధులు విడుదల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది.
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం
ప్రతిపాదనలు ఇలా..
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కొత్తగా విలీనమైన ఆర్‌అండ్‌ఆర్ కాలనీతో కలుపుకొని 75వేలకుపైగా జనాభా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి 20వార్డులు ఉన్నాయి. ఈ పట్టణ క్రమంగా పెరుగుతుండటంతో త్వరలోనే వార్డుల డీలిమిటేషన్‌కు కూడా రంగం సిద్ధమైంది. గతంతో పోలిస్తే కొత్తగా ఏర్పడిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీతోపాటు ఇతర కాలనీల్లో మరిన్ని సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారటం, కొన్ని కాలనీల్లో లైటింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, మిషన్ భగీరథ నల్లాల వ్యవస్థ కూడా పూర్తిగా లేకపోవడం, ప్రధాన రోడ్లు ఇంకా కొన్ని చోట్ల పెండింగ్‌లో ఉండటంతో జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత జూలైలో ఇక్కడి నుంచి టీయూఎఫ్‌ఐడీసీ నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు. ఇందులో ప్రధానంగా ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.కోటి, చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధికి రూ.కోటి, ప్రధాన రహదారులపై పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.5కోట్లు సుమారు మరో 1.15కోట్లకుపైగా సీసీ రోడ్లు, ఇతర పనులు ఉన్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో 1.57లక్షల జనాభా, 43వార్డులు ఉండగా.. ఇక్కడ కూడా అదే తరహాలో పనులను ప్రతిపాదించారు. కానీ ఈ రెండు మున్సిపాలిటీలకు నిధుల విడుదలలో జాప్యం నెలకొనడం చర్చనీయాంశమైంది. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు ఈ నిధులతోనైనా మోక్షం లభించనుందని ఎదురుచూస్తున్నారు. కానీ భిన్నమైన పరిస్థితి నెలకొనడం కలవరానికి గురిచేస్తోంది.
ప్రధాన మున్సిపాలిటీలకు టీయూఎఫ్‌ఐడీసీ నిధులేవీ?
సిద్దిపేట, గజ్వేల్‌కు
నేటికీ విడుదలకాని వైనం
హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలకు
మాత్రమే మంజూరు
కనీస వసతుల కల్పనకు
రూ.15కోట్ల చొప్పున కేటాయింపు
జిల్లాలో జోరుగా చర్చనీయాంశం
నిధుల కోసం ఎదురుచూపు
టీయూఎఫ్‌ఐడీసీ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నాం. ఈ అంశం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని మున్సిపల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కారణాలపై ఇంకా స్పష్టత లేదు.
– బాలకృష్ణ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్
మున్సిపల్ కమిషనర్

నిధులు రాక.. పనులు సాగక