
రోల్ మోడల్‌గా నిలవండి
సిద్దిపేటజోన్: క్రమ శిక్షణతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బాగా చదివి రోల్ మోడల్‌గా నిలవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం స్థానిక బాలసదనం సందర్శించి దీపావళి పండుగ సందర్భంగా పిల్లలకు ముందస్తుగా స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. రోజూ ధ్యానం, యోగా చేయాలని, ఒత్తిడికి లోనుకాకుండా శారీరకంగా. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం బాలసదనం సిబ్బందితో మాట్లాడారు. తల్లిదండ్రులు లేరనే బాధ వారికి రాకుండా చూసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు మరమ్మతు చేయించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కారం చేయాలన్నారు. శిశు గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్న శిశువుల గురించి అరా తీశారు.
నేడు మా ఇంటికి రండి
బాలసదనం పిల్లలందరూ మా ఇంటికి రావాలని కలెక్టర్ స్వయంగా ఆహ్వానించారు. ఎవ్వరూ లేరనే భావన రావొద్దన్నారు. దీపావళి పండుగ సందర్భంగా వారికి నేనే స్వయంగా వంట చేసి భోజనం వడ్డిస్తానని కలెక్టర్ హైమావతి అధికారులతో అన్నారు. పిల్లలందరినీ సోమవారం తన క్యాంపు కార్యాలయానికి తీసుకురావాలని, అక్కడే అంతా పండుగ చేనుకుందామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శారదతో కలెక్టర్ అన్నారు.
క్రమశిక్షణ, మంచి అలవాట్లు ముఖ్యం
ఉన్నత స్థాయే లక్ష్యంగా చదవాలి
కలెక్టర్ హైమావతి