
ధాన్యం కొనుగోలు ఎన్నడో?
దుబ్బాక: రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవిలా తయారైంది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను తీరా అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలతో అష్టకష్టాలు పడి కోతకోసి ధాన్యాన్ని అమ్ముకునేందుకు వస్తే కొనుగోలు లేక రైతులు పరేషాన్ అవుతున్నారు. మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ చెప్పడమే తప్పా ఆచరణలో కనిపించడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చోట్ల ధాన్యం కాంటాలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడం.. ఇంకా చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల జాడనే లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.
105 టన్నుల ధాన్యమే కొనుగోలు
వానాకాలంలో 3.60 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయడంతో కొనుగోలు కేంద్రాలకు సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అఽధికారుల అంచనాగా ఉంది. కాగా కేవలం జిల్లాలోని బెజ్జంకి, కొహెడ, హుస్నాబాద్ కేంద్రాల్లోనే కేవలం 25 మంది రైతుల నుంచి 105 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
ఇప్పటి వరకు 270 కేంద్రాలే..
జిల్లాలో వానాకాలంలో 439 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించగా.. ప్రస్తుతం కేవలం 270 కేంద్రాలే ప్రారంభం కావడం శోచనీయం. ఇంకా 169 కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 179 ఐకేపీ, 91 ఫ్యాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దుబ్బాక, చెల్లాపూర్, రాజక్కపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్‌తో పాటు చాలా చోట్ల కేంద్రాల జాడ లేవు.
వర్షాల భయంతో..
వర్షాల భయంతో చాలామంది రైతులు ముందస్తుగానే వరికోతలు ప్రారంభించారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిండిపోవడంతో గత్యంతరం లేక చాలా మంది రైతులు దొరికిన చోటల్లా కుప్పలు పోసుకుంటున్నారు. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు అయిన దుబ్బాక యార్డుతో పాటు చాలా కేంద్రాల్లో ధాన్యం కుప్పలతో నిండిపోయాయి.
కేంద్రాలకు పోటెత్తిన వడ్లు
270 కేంద్రాలే ప్రారంభం
ఇంకా ప్రారంభంకాని 169 కేంద్రాలు
6 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం వస్తుందని అంచనా
ఇబ్బందులు పడుతున్న రైతులు