సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

సన్నాహాలు

Sep 22 2025 8:29 AM | Updated on Sep 22 2025 8:29 AM

సన్నాహాలు

సన్నాహాలు

కార్యాచరణ సిద్ధం చేసిన అధికారులు

1.25కోట్ల గన్నీ బ్యాగులు అవసరం

ధాన్యం కొనుగోళ్లకు

5.03 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా వడ్ల సేకరణ లక్ష్యం

439 కేంద్రాలు ఏర్పాటు

ఇరవై రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ షురూ..

ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలో 3.6లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రాగా, 8.28లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 5.03లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఇందుకోసం 439 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. – గజ్వేల్‌

జిల్లాలో వడ్ల కొనుగోళ్లను చేపట్టడానికి అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఈ అంశంపై ఒక దఫా ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఒకటిరెండ్రోజుల్లో మరోసారి సమీక్ష జరిపి ఏర్పాట్లపై సర్వం సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి 3.60లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. ఇందులో 3.24లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగులోకి వచ్చాయి. మరో 36వేల ఎకరాల్లో సన్న రకం వడ్లు సాగయ్యాయి.

అతివృష్టి.. యూరియా కొరతతో..

ఈసారి అతివృష్టి చాలా ప్రాంతాల్లో వరికి తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. భారీ వరదల కారణంగా వరి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. దీనివల్ల ఆదిలోనే పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. మరోవైపు యూరియా కొరత కూడా వరి దిగుబడులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. సకాలంలో యూరియా వేయకపోవడం వల్ల పంట ఎదుగుదల లోపించింది. మరోవైపు తెగుళ్లు చుట్టుముట్టి దిగుబడులు పడిపోయేలా చేశాయి. అయినా ఈ సీజన్‌లో మొత్తంగా 8.28లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 5.03లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా కొనుగోలు కేంద్రాలకు అమ్మకానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులోభాగంగానే 4.83లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం, మరో 20,380 మెట్రిక్‌ టన్నుల సన్నరకం వడ్లు వస్తాయని భావిస్తున్నారు.

వచ్చే నెల 10 తరువాతే..

అక్టోబర్‌ 10తర్వాతే కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశమున్నందన అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది వరికి రూ.2,369మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రూ.69 పెరిగింది. మద్దతు ధరను రైతులకు కచ్చితంగా అందించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ప్రత్యేకించి గన్నీ బ్యాగుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇబ్బందులు రానివ్వం

జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. కొనుగోళ్లకు సర్వం సిద్దం చేస్తున్నాం. మరో 20 రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తాం.

– ప్రవీణ్‌, పౌరసరఫరాల శాఖ డీఎం

ఈ సీజన్‌లో వడ్ల కొనుగోళ్లకు మొత్తంగా 439 కేంద్రాలను ఏర్పాటుచేయడానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో 231ఐకేపీ, 202 సహకార సంఘాలు, మరో 6 మెప్మాకు చెందిన కేంద్రాలు ఉండబోతున్నాయి. అంతేకాకుండా వడ్లను నింపడానికి 1,25,95000 గన్నీ బ్యాగులు అవసరముండగా, ఇందులో 5,79,3700 పాతవి అందుబాటులో ఉన్నాయని, మరో 6,80,1300 కొత్త గన్నీ బ్యాగులను తెప్పించనున్నారు. అదేవిధంగా వడ్లను నిల్వ చేసుకోవడానికి అవసరమైన గోదాములను సైతం సిద్ధం చేశారు. గోదాముల వద్ద సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. సన్నరకం వడ్లను అమ్మిన రైతులకు వెంటనే బోనస్‌ డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడానికి అవసరమైన చర్యలు సైతం చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement