
వయో వృద్ధులకు డే కేర్
జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా వృద్ధులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల నిమిత్తం వెళ్లినప్పడు ఒంటరితనంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తమను పలకరించేవారు లేక మనోవేధనకు గురవుతున్నారు. ఇలాంటి వారికి డే కేర్ సెంటర్ బాసటగా నిలవనుంది. ఇందులో ఇతర వృద్ధులతో కలిసి ఆడుతూ, పాడుతూ సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. త్వరలో జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యే కేంద్రంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 50 మంది ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వృద్ధులు ఈ కేంద్రంలో ఉండడానికి వీలుగా ఇండోర్ గేమ్స్, గ్రంథాలయం, ఇతరత్ర సదుపాయాలు కల్పించనున్నారు. జిల్లాలో ఈ కేంద్రం ఏర్పాటు కోసం సేవా సంఘం అనే ఎన్జీఓకు అధికారులు బాధ్యతలు అప్పగించారు. మెదక్ పట్టణంలో ఒక భవనాన్ని సైతం ఎంపిక చేసినట్లు సమాచారం.