
యూరియా.. అవే అవస్థలయా
హుస్నాబాద్‌లోని రైతు వేదిక వద్ద వందలాది మంది రైతులు క్యూ కట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన నేపథ్యంలో రోడ్ల వెంబడి రైతులుంటే ఆందోళన చేస్తారని ముందస్తుగా టోకెన్ల పంపిణీని రైతు వేదికకు మార్చారు. ఇక్కడ టోకెన్ తీసుకొని డబ్బులు చెల్లించేందుకు దుకాణాల వద్దకు వెళ్లారు. అక్కడ రీశీదు తీసుకొని బస్తాల కోసం గోదామ్‌ల వద్ద క్యూలో నిల్చున్నారు. దీంతో మూడు చోట్ల లైన్లు కడితే గాని ఒక్క యూరియా బస్తా దొరకని పరిస్ధితి.
హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌కు చెందిన శివరాత్రి శ్రీకాంత్ నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఎకరం మొక్కజొన్న, మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. సమాయానికి యూరియా వేయకపోవడంతో మొక్కజొన్న చేను ఎర్రబడి ఎదగలేదు. చేసేదిలేక పశువుల మేతకు వదిలేశాడు.
సిద్దిపేట మండలం చిన్నగుండవెళ్లిలో యూరి యా కోసం నిరీక్షించారు. ఒక రోజు ముందుగానే సమాచారం అందడంతో ఉదయాన్నే వచ్చి క్యూలైన్‌లో నిలుచున్నారు. వరుసలో చెప్పులను పెట్టారు. ఎట్టకేలకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు.
చేర్యాలలో గురువారం రైతులు రాస్తారోకో చేశారు. పనులన్నీ మానుకుని రోజంతా పడిగాపులు కాస్తున్నామని, ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దౌల్తాబాద్ మండలం ఇందూప్రియాల్‌లో రైతు ముత్యాలు మొక్కజొన్న పంటను దున్నేశాడు. సకాలంలో యూరియా అందకపోవడంతో దిక్కుతోచని స్థితికి గురై పంటను దున్నాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
దుబ్బాకలో యూరియా కోసం బారులుదీరిన రైతులు
పలు ప్రాంతాల్లో బారులు తీరిన రైతులు ఒక్క బస్తా కోసం గంటల తరబడి నిరీక్షణ
జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తీరడంలేదు. వ్యవసాయ పనులన్నీ వదిలేసి యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. వేసిన పంటలను రక్షించుకునేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఒక రోజు ముందే యూరియా పంపిణీ కేంద్రాలకు సద్దులు, దుప్పట్లు పట్టుకుని వస్తుండటం గమనార్హం. గురువారం దుబ్బాకలో ఇదే సీన్ కనిపించింది. వేల మంది రైతులు గంటల కొద్దీ లైన్‌లో నిరీక్షించారు. ఈ క్రమంలో గంభీర్‌పూర్‌కు చెందిన వృద్ధురాలు రెడ్డి చిత్తవ్వ స్పృహతప్పి పడిపోయారు. దీంతో తోటి రైతులు సపర్యలు చేయడంతో కోలుకున్నారు. పాఠశాలలు, కళాశాలలకు డుమ్మాకొట్టి విద్యార్థులు సైతం తల్లిదండ్రుల కోసం క్యూలో నిల్చుంటున్నారు. తీరా 520 యూరియా బస్తాలు వస్తే కొద్ది మందికే దొరకడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరుగాల్సి వచ్చింది.
– సిద్దిపేటరూరల్/దుబ్బాక/హుస్నాబాద్/రూరల్/చేర్యాల(సిద్దిపేట)/దౌల్తాబాద్ (దుబ్బాక)