
పత్రికా స్వేచ్ఛపై దాడే..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా కలంపై కత్తి కట్టడాన్ని పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు
సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్
ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పలువురి నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
కక్ష సాధింపు సిగ్గుచేటు
దుబ్బాక: ఆంధ్ర ప్రదేశ్‌లో నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలకు మద్దతుగా కథనాలు రాస్తున్న సాక్షిపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్యాలయాలపై దాడులకు పాల్పడటం పత్రిక స్వేచ్ఛను హరించడమే. ప్రజల కష్టాలను, కన్నీళ్లను, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా వెలికితీసే కథనాలు రాయడమే సాక్షి తప్పా. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటు. దాడులు, అక్రమ కేసులను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించడంతో పాటుగా సాక్షికి అండగా నిలుద్దాం.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
దమననీతి చర్యలు తగవు
ఏపీ ప్రభుత్వం చేస్తున్న దమననీతి చర్యలు ఖండిస్తున్నాం. వాస్తవాలు బాహ్య ప్రపంచానికి చెప్పే బాధ్యతగా సాక్షి మీడియా ప్రయత్నాలు చేస్తుంటే, అణచివేత ధోరణితో నిర్బంధ చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛను హరించడమేకాక, ప్రజల భావ స్వేచ్ఛను కాలరాయడమే. తక్షణమే ప్రభుత్వం ఈ చర్యలను విరమించాలి.
–రంగాచారి. జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు
ఏపీలో పోలీస్ రాజ్యం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పోలీసులను, అధికారులను ఉపయోగించి పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్నారు.ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. సాక్షి ఎడిటర్, సాక్షి మీడియా మీద నిర్బంధ చర్యలు సరికావు. ఇది మంచి సంస్కృతి కాదు. నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా పాలన సాగుతోంది. తీవ్రంగా ఖండిస్తున్నాం.
–రాజిరెడ్డి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
కేసులు పెట్టడం మూర్ఖత్వమే..
సిద్దిపేటఅర్బన్: ఏపీ లోని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌పై, జర్నలిస్టులపై కేసులు పెట్టడం మూర్ఖత్వమే.. కేసులు పెట్టి భయపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని, భావప్రకటన స్వేచ్ఛను కాలరాయాలని చూడడం సరైంది కాదు.
– ఆముదాల మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
ముమ్మాటికీ కక్షపూరితమే..
సిద్దిపేటఅర్బన్: నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియానే. ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం హేయమైన చర్య. కలంపై కత్తి కట్టడం ముమ్మాటికీ కక్షపూరితమైన చర్యే.
– కిష్టాపురం లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి
జర్నలిస్టుల గొంతు నొక్కడమే..
ఏపీలో జర్నలిస్టులపై, ముఖ్యంగా సాక్షి మీడియాపై జరుగుతున్న నిర్బంధ చర్యలు భావ స్వేచ్ఛను హరించేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పోలీస్ యంత్రాంగం ద్వారా పత్రికా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముమ్మాటికీ జర్నలిస్టుల గొంతు నొక్కడమే. ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే పత్రికా ముఖంగా ఖండించాలి. కానీ ఇలాంటి చర్యలు చేపట్టడం తగవు.
–గందే నాగరాజు,
జిల్లా జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు