మళ్లీ వణికిన మెదక్‌ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ వణికిన మెదక్‌

Sep 12 2025 11:30 AM | Updated on Sep 12 2025 11:30 AM

మళ్లీ వణికిన మెదక్‌

మళ్లీ వణికిన మెదక్‌

కొల్చారంలో 8 సెం.మీ నమోదు

లోతట్టు ప్రాంతాలు జలమయం

పలువురి ఇళ్లలోకి చేరిన వరద

ఇబ్బంది పడిన వాహనదారులు

మెదక్‌జోన్‌: భారీ వర్షంతో మెదక్‌ మరోసారి అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా రాందాస్‌ చౌరస్తాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు దుకాణాల్లోకి నీరు చేరింది. స్పందించిన మున్సిపల్‌ అధికారులు అడ్డుగా ఉన్న డివైడర్‌ను జేసీబీతో తొలగించి నీరు దిగువకు వెళ్లేలా చేశారు. అలాగే పట్టణంలోని గాంధీనగర్‌లో పలువురి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బృంధావన్‌నగర్‌, ఫతేనగర్‌, సాయినగర్‌, నర్సిఖేడ్‌ కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే మెదక్‌ మండలంలోని పలు గ్రామాల్లో 17 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 8 సెంటీ మీటర్లు, హవేళిఘణాపూర్‌లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి మెదక్‌ అంతా జలమయం అయింది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న పుష్పలవాగు ఉధృతి మళ్లీ ప్రారంభం కావటంతో సమీపంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మళ్లీ నీట మునుగుతుందా.. అంటూ జనం భయాందోళన వ్యక్తం చేశారు. వర్షం తగ్గటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లాలోనూ వర్షాలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలో గురువా రం సాయంత్రం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం మిరుదొడ్డి మండలంలో 39.6 మిల్లీమీటర్లు, అక్కన్నపేటలో 21.5 మి.మీ, దుబ్బాకలో 17.8 మి.మీ, నంగునూరు మండలంలో 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

కుమ్మేసిన వాన.. మెదక్‌లో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement