
‘కోడ్’ల రద్దుకు సంఘటిత పోరు
గజ్వేల్: కార్మికుల పాలిట ఆశనిపాతంగా మారిన లేబర్‌కోడ్‌ల రద్దుకు సంఘటితంగా ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. గురువారం గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో రాణే బ్రేక్‌లైనింగ్ ఫ్యాక్టరీ కార్మిక యూనియన్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల స్థానంలో లేబర్‌కోడ్‌లను అమలు చేయడం వల్ల కార్మికుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదని వాపోయారు. దీనివల్ల కనీస వేతన హక్కుచట్టం, గ్రాట్యూటీ, పెన్షన్, పనిభద్రత, సెలవులు, ఇతర సౌకర్యాలు లేకుండా హరించివేస్తున్నారని తెలిపారు. కార్మికులతో పాటు ఉద్యోగులకు ఈ లేబర్‌కోడ్‌లు తీవ్రమైన నష్టాన్ని కల్పించనున్నాయని పేర్కొన్నారు. వీటిని రద్దు చేసేంతవరకు పోరాటాలను ముమ్మరం చేయాల్సిన అవసరమున్నదని పిలుపునిచ్చారు.