
తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తున్న అధికారులు
మహిళలే అధికం
కోహెడ మండలంలో ఓటర్లు ఎక్కువ
దూళ్మిట్టలో తక్కువ
జిల్లాలో పరిషత్ ఓటర్లు 6,55,958 మంది ఉన్నారు. పరిషత్ ఓటర్ల తుది జాబితాను బుధవారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో సీఈఓ రమేశ్ విడుదల చేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారీగా జాబితాను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రాగానే నిర్వహించేందుకు ఓటరు జాబితాను సిద్ధం చేశారు. – సాక్షి, సిద్దిపేట
మహిళా ఓటర్లే..
పరిషత్ ఓటర్లలో మహిళా ఓటర్ల అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఓటర్లు 6,55,958 మంది ఉండగా అందులో మహిళలు 3,34,186, పురుషులు 3,21,766, ఇతరులు ఆరుగురు ఉన్నారు. కోహెడ మండలంలో అధికంగా ఓటర్లు, దూళ్మిట్టలో తక్కువ ఓటర్లు ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా మూడు అభ్యంతరాలు
జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా 1,291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6న ఓటరు ముసాయిదాను ప్రదర్శించారు. ఈ నెల 8న జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా దరఖాస్తులను ఈ నెల 8 వరకు స్వీకరించగా మూడు అభ్యంతరాలు వచ్చాయి. వాటిని 9వ తేదీ వరకు పరిష్కరించి బుధవారం జాబితాను ప్రచురించారు. జిల్లాలో జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) 26, మండల ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ)లు 230 ఉన్నాయి.