
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
కొండపాక(గజ్వేల్): సాక్షాత్తు కలెక్టర్ ఆదేశాలను ఆర్‌ఎంపీ వైద్యుడు ఉల్లంఘించారు. ఆస్పత్రిని సీజ్ చేసినా వెనకాల నుంచి యథాతథంగా వైద్య చికిత్సలు చేస్తున్నారు. ఈ ఘటన కుకునూరుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడు సుదర్శన్.. ఆస్పత్రి అని పేరుపెట్టుకొని వైద్యం అందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన విద్యార్థి యశ్వంత్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా ఎలాంటి పరీక్షలు చేయకుండానే అత్యవసర వైద్యం అందించడంతో ఆగస్టు 29న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి ధనరాజు ఆస్పత్రిని సీజ్ చేశారు. అంతేకాక పోలీస్‌స్టేషన్‌లో వైద్యుడిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదయ్యింది. అయినా యథావిధిగా ఆస్పత్రి వెనుక నుంచి డోర్ ఓపెన్‌చేసి వైద్య చికిత్సలు చేస్తున్నారు. వెనకాల డోర్ తెరిచి ఉన్న దృశ్యాన్ని బుధవారం సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. దీంతో పాటు లోపలికి వెళ్లి ఆస్పత్రి సీజ్ అయిన విషయాన్ని వైద్యుడు సుదర్శన్‌తో ప్రస్తావించగా.. సీజ్ అయిన విషయం వాస్తవమే. కానీ వెనకాల ఉన్న డోర్‌ను వైద్యాధికారి ధనరాజ్ ఓపెన్ చేసుకోమన్నారంటూ చెప్పడం గమనార్హం. ఈ విషయమై వైద్యాధికారిని వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని, నిబంధలు ఉల్లంఘిస్తే మరో కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామన్నారు.
ఉల్లంఘించిన ఆర్‌ఎంపీ వైద్యుడు
ఆస్పత్రిని సీజ్ చేసినా
యథాతథంగా వైద్య చికిత్సలు

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్