మారనున్న గజ్వేల్‌ స్వరూపం | - | Sakshi
Sakshi News home page

మారనున్న గజ్వేల్‌ స్వరూపం

Jul 21 2025 8:07 AM | Updated on Jul 21 2025 8:07 AM

మారనున్న గజ్వేల్‌ స్వరూపం

మారనున్న గజ్వేల్‌ స్వరూపం

పెరగనున్న వార్డుల సంఖ్య
● మున్సిపాలిటీలో 30కి చేరే అవకాశం ● ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ విలీనంతో పెరిగిన పట్టణ పరిధి ● ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి పూర్తి కానున్న వార్డుల డీలిమిటేషన్‌ ● మార్పులు, చేర్పులపై సర్వత్రా ఆసక్తి

గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ స్వరూపం మారనుంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా.. మరో 10 వార్డులు పెరిగే అవకాశం ఉంది. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి వార్డుల డీలిమిటేషన్‌ పూర్తి చేయనున్నారు. మున్సిపాలిటీలో

ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ విలీనం కావడంతో మార్పులు జరగనున్నాయి. ఈ అంశాలపై పట్టణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

– గజ్వేల్‌

జ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధి ప్రస్తుతం 49 చదరపు కిలోమీటర్లు పరిధి కలిగి ఉంది. మున్సిపాలిటీలో గజ్వేల్‌తో పాటు ప్రజ్ఞాపూర్‌, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్‌, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామాలు ఉన్నాయి. దీంతో పట్టణ జనాభా 55వేలకు చేరుకుంది. మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామాలైన పల్లెపహాడ్‌, వేములగాట్‌, ఏటిగడ్డకిష్టాపూర్‌, ఎర్రవల్లి, సింగారంతోపాటు ఈ పంచాయతీల పరిఽధిలోని లక్ష్మాపూర్‌, రాంపూర్‌, బ్రహ్మణ బంజేరుపల్లి తదితర గ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని నిర్మించి ఇచ్చిన సంగతి తెల్సిందే. కాలనీలో నివాసముంటున్నా.. 2020 నుంచి కొంతకాలం వరకు ఆయా గ్రామాలు పంచాయతీలుగానే కొనసాగాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలో 15వేల జనాభా, మరో 13వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ పంచాయతీలను రద్దు చేశారు.

ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ విలీనంతో..

మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామ పంచాయతీలను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత యథాతథంగా ఈ గ్రామాలన్నీ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఈ క్రమంలోనే నిర్వాసిత గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, ఇతర సామాజిక అవసరాల బాధ్యతను మున్సిపల్‌ యంత్రాంగమే చేపడుతోంది. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ భౌగోళికంగా మున్సిపాలిటీ పరిఽధిలోనే ఉంది. గతంలో మున్సిపాలిటీలో చేరాలా?.. వద్దా? అనే అంశంలో కొంతకాలం నిర్వాసితులు సందిగ్ధంలో ఉన్నారు. తమను ప్రత్యేక పంచాయతీలుగానే ఉంచాలని కోరారు. కానీ భౌగోళికంగా మున్సిపాలిటీ పరిధిలో ఉండటం వల్ల ప్రత్యేక పంచాయతీలుగా కొనసాగించడం కుదరదని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కలెక్టర్‌ నుంచి స్థానిక మున్సిపల్‌ అధికారులకు నిర్వాసిత గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అంశాల బాధ్యత మున్సిపల్‌ యంత్రాంగానిదేనని మార్గదర్శకాలు రావడంతో విలీనం జరిగినట్లేనని స్పష్టమైంది.

మారనున్న సమీకరణలు

మున్సిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. వార్డుల విభజన గతంతో పోలిస్తే కొంత మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కౌన్సిలర్లుగా పోటీ చేయనున్నారు. ఔత్సాహికులు వార్డుల ఎంపికలో తమకు అనుకూలగా ఉండే వార్డుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. మరోవైపు మున్సిపాలిటీలో ఎలాగైనా పట్టు సాధించాలని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నోటిఫికేషన్‌ కంటే ముందే పట్టణంలో అన్ని పార్టీల్లోనూ చేరికలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి వార్డుల సంఖ్య పెంపు మున్సిపల్‌ రాజకీయాల్లో కీలకమార్పులను తేబోతోంది.

75 వేలకుపైగా జనాభా..

ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ విలీనం తర్వాత పట్టణ జనాభా సుమారు 75వేల పైచిలుకు చేరుకుంది. ఓటర్ల సంఖ్య కూడా భారీగానే పెరగనుంది. సుమారు 45వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వార్డుల సంఖ్య పెంచడం అనివార్యమవుతోంది. ప్రస్తుతం 20 వార్డులుండగా మరో 10 వార్డులు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కో వార్డులో 1500మంది ఓటర్లకు తగ్గకుండా విభజన జరుగనుంది. మున్సిపల్‌ ఎన్నికలలోపే వార్డుల డీలిమిటేషన్‌లో ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement