
కేంద్ర పథకాల అమలుపై ఆరా
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని గురువన్నపేటలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై కేంద్ర బృందం సభ్యులు జోస్లీజోసఫ్, వినోద్, అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్‌గౌడ్, డీఎల్‌పీఓ మల్లికార్జునరెడ్డితో కలసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు, పేదరిక నిర్మూలన చర్యలు, స్వయం ఉపాధి రుణాల వితరణ వంటి అంశాలపై ప్రజలు, మహిళాసంఘాల సభ్యులతో చర్చించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపనులు ఎలా చేపడుతున్నారు? ఎంత ఖర్చు వస్తుంది? ప్రభుత్వం ఎంత చెల్లిస్తోందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీడీ సతీష్, ఎంపీడీఓ శ్రీనివాస వర్మ, పీఆర్ ఏఈ శివకుమార్, ఏపీఓ బాలలింగం, ఏఈ హౌసింగ్ మేఘన, ఏకేపీ ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.