మంత్రి వివేక్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు | - | Sakshi
Sakshi News home page

మంత్రి వివేక్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

Jul 21 2025 8:05 AM | Updated on Jul 21 2025 8:07 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తుండగా ఆదివారం చర్లఅంకిరెడ్డిపల్లి వద్ద కాంగ్రెస్‌ నాయకులు కలిశారు. మంత్రిని సన్మానించారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి అజ్జు యాదవ్‌ మండలంలో జరుగుతున్న అభివృద్ధి, తదితర అంశాలను మంత్రికి వివరించారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయించాలని కోరారు. ఆయనతో పాటు నాయకులు అనిల్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రమేష్‌, వెంకటేశం, ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

కేజీబీవీలో స్పాట్‌ అడ్మిషన్లు

చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలోని కేజీబీవీ జూనియర్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు జరగనున్నాయి. సీఈసీ ఇంగ్లిష్‌ మీడియంలో మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న 20 సీట్లకు సోమవారం స్పాట్‌ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఎస్‌ఓ కృష్ణవేణి తెలిపారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి పాసైన విద్యార్థినులు ఉపయోగించుకోవాలని సూచించారు.

‘కొండపోచమ్మ’ అభివృద్ధికి కృషి

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొండపోచమ్మ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. భక్తుల కోసం మంచి నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ అనుగీత, ఈఓ రవికుమార్‌, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల పెన్షన్‌ పెంచాలి

సిద్దిపేటకమాన్‌: దివ్యాంగులకు ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్లను ప్రభుత్వం పెంచాలని ఎమ్మార్పీఎస్‌, వీహెచ్‌పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌, వీహెచ్‌పీఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆగస్టు 13న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో జరిగే వికలాంగుల పెన్షన్‌దారుల మహాగర్జన సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శంకర్‌, కుమార్‌, యాదగిరి, పరశురాములు, ప్రసాద్‌, నర్సయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదకరంగా బావి

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండల కేంద్రంలో ఇళ్లమధ్య ప్రమాదకరంగా బావి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కనీసం రక్షణ గోడ లేకపోవడం.. సీసీ రోడ్డు పక్కనే ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఏదైనా కొంచెం ఏమరుపాటు జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రమాదం జరగకముందే బావిని పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

దుబ్బాక: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ భవాని కోరారు. కామర్స్‌ 2, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ 1, తెలుగు అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు 23లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అభ్యర్థులు పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

మంత్రి వివేక్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు 1
1/2

మంత్రి వివేక్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

మంత్రి వివేక్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు 2
2/2

మంత్రి వివేక్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement