
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
సాక్షి, సిద్దిపేట/కోహెడ(హుస్నాబాద్): పర్యావరణ పరిరక్షణలో మహిళలు ముందుండాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. కోహెడలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు, స్టీల్ సామగ్రి పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్న 276 మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాజ్‌భవన్‌లో మంత్రి పొన్నం.. స్టీల్ బ్యాంక్ గురించి చెప్పినప్పుడు చాలా నచ్చిందని గుర్తుచేశారు. ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా స్టీల్ సామగ్రి వినియోగించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో బర్తన్ బ్యాంక్ భావితరాలకు దోహదపడుతుందన్నారు.
ఐటీ విప్లవం కంటే గొప్పది..
ఈ బర్తన్(స్టీల్) బ్యాంకు చిన్నపనే అయినప్పటికీ అది భవిష్యత్‌లో బాటలు వేస్తుందని గవర్నర్ అన్నారు. ఇది ఆటోమొబైల్, ఐటీ విప్లవం కంటే గొప్ప కార్యక్రమం అని కోనియాడారు. పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటామన్నారు. మానసేవ చేసే అవకాశాలు జీవితంలో అరుదుగా వస్తాయన్నారు. మానవ సేవ చేయాలని సంకల్పించినప్పుడు అదొక ఉద్యమంగా మారుతుందని తెలిపారు. తనది త్రిపుర రాష్ట్రం అని ఇప్పుడిప్పుడే తెలుగు అర్థమవుతుందని స్పష్టం చేశారు.
ప్లాస్టిక్‌ను దూరం పెడితే ఆరోగ్యంగా ఉన్నట్లే..
బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ పాస్టిక్‌ను దూరం పెడితే మీరు ఆనారోగ్యాలను దూరం పెట్టినట్లే తెలిపారు. స్టీల్ బ్యాంక్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజక వర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 276 మహిళా సంఘాలకు సుమారు రూ.2.5కోట్లు నిధులతో స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామన్నారు. మంత్రి కొండా మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ను దూరంగా పెట్టి ఆరోగ్యంగా జీవించాలన్నారు.
మహిళా సంఘాలకు రుణాలు
మండల వ్యాప్తంగా ఉన్న 38 వీఓ సంఘాలకు రూ.28.96 కోట్లు వడ్డీలేని రుణాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందించారు. అలాగే రూ.166.94 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు, పలువురికి ప్రమాద బీమా చెక్కులు అందించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ అనురాధ సూచనలతో హుస్నాబాద్ ఏసీఏ సదానందం, సీఐ శ్రీను, ఎస్‌ఐలు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సేర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్‌కు ఘన స్వాగతం
స్టీల్ సామగ్రి పంపిణీ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్‌కు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కలెక్టర్లు హైమావతి, ప్రమేలా సత్పతి, స్నేహశబరిష్‌లు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం ఫలికారు. అనంతరం గవర్నర్ మొక్కలు నాటారు. కోహెడ నుంచి వేములవాడకు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. స్వర్గీయ పొన్నం సత్తయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
మహిళలు కీలక పాత్ర పోషించాలి
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
276 మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రి పంపిణీ
మొక్కలు నాటిన గవర్నర్, వేములవాడకు ఆర్టీసీ బస్సు ప్రారంభం
మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రులు

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం