
చెరువుకు చేరని చేప
మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లలపంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రతి ఏటా జూలై నెలలో టెండర్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం పంపిణీ విషయమై ఊసేత్తడం లేదు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగుతుందా.. లేదా? అనే సందిగ్ధం నెలకొంది.
కోహెడరూరల్(హుస్నాబాద్): అసలే అరకొర వర్షాలు. చెరువు, కుంటల్లోనూ అంతంతమాత్రమే నీళ్లు. అయినా చేప పిల్లల పంపిణీపై సందిగ్దం నెలకొంది. గతంలో ఏప్రిల్ చివరి వారంలో ప్రకటన విడుదల చేసి మే నెలలో టెండర్లు ఖరారు చేసేవారు. వర్షాలు కురవగానే జూన్ నుంచి ఆగస్టులోగా చేప పిల్లల పంపిణీ జరిగేది. అలాంటిది ఈ ఏడాది జూన్ నెల గడిచిపోతున్నా టెండర్ల జాడలేదు. మే నెలలో టెండర్లు జరిగితే జూన్ వరకు చేప పిల్లలు అందుబాటులో ఉంచాలి. 8 నుంచి 100 ఎంఎం సైజు ఉన్న చేప పిల్లలను పంపిణీ చేస్తే ఒక్కో చేప పిల్లకు రూ.1.73 చొప్పున చెల్లిస్తారు.
5కోట్ల చేప పిల్లలు..
జిల్లాలో మొత్తం 1500 చెరువులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదులుతారు. దీంతో పాటు రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌తో పాటు మరో 6 రిజర్వాయర్లలో చేప, రోయ్య పిల్లలను పంపిణీ చేస్తారు. జిల్లాలో మొత్తం 350కి పైగా మత్య్సకార సొసైటీలు ఉండగా 25 వేల మంది సభ్యులు ఉన్నారు.
గతేడాది తీవ్ర నష్టం
గతేడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చాలా ఆలస్యంగా సాగింది. పిల్లల్ని పంపిణీ చేయడం సెప్టెంబర్‌లో మొదలైంది. డిసెంబర్ వరకు చేప పిలల్ని చెరువులు, కుంటల్లో వదిలారు. దాంతో చేపలు కిలో నుంచి 2 కిలోల సైజు పెరగాల్పి ఉన్నా అరకిలో నుంచి కిలో సైజు మాత్రమే పెరిగింది. దీని వల్ల తీవ్రంగా నష్టపోయారు. బొచ్చ, రవ్వ, బంగారు తీగ, మ్రిగాల, రోయ్యల వంటి ఆయా రకల చేపల్ని ఎక్కువగా పెంచుతారు.
పెరుగుదలపై ప్రభావం..
చెరువుల్లో రెండు పరిమాణాలు ఉన్న చేప పిల్లలను వదులుతారు. పూర్తిగా నీటితో నిండిన చెరువుల్లో 45 రోజుల వయసున్న 35– 40 మి.మీ. పొడవు చేప పిల్లలు వదలాల్సి ఉంటుంది. ఏడాది మొత్తం నీరుండే పెద్ద చెరువులు, జలాశయాల్లో 75 రోజుల వయసున్న 80–100 మి.మీ. పొడవున్న చేపపిల్లలను వదులుతారు. అవి కిలో సైజులో పెరగాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. చేప పిల్లలను ఆలస్యంగా వదిలితే ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. సెప్టెంబర్‌లో వదిలితే అవి కిలో సైజు రావాలంటే ఫిబ్రవరి అవుతుంది. ఇంకా పెరగలంటే వేసవి వచ్చేస్తుంది. ఉష్ణోగ్రతల కారణంగా నీటిలోనే చనిపోయే ప్రమాదం ఉందని పలువురు మత్స్యకారులు తెలిపారు.
టెండర్లు ఇంకెప్పుడు?
పంపిణీపై స్పష్టత కరువు
ఆలస్యమైతే ఎదుగుదల ఉండదని మత్స్యకారుల్లో ఆందోళన
ఏటేటా తగ్గుతున్న చేప పిల్లల సంఖ్య
జిల్లాలో 1500 చెరువులు.. 25 వేల మంది సభ్యులు
ఆదేశాలు రాలేదు
చేపల టెండర్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రతి ఏటా మే నెల నుంచే టెండర్లు వేస్తాం. ఈసారి ఇంకా వేయలేదు. ఆదేశాలు అందగానే టెండర్లు వేస్తాం. – మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి