
ఆయిల్‌పామ్ ధర పెంచేందుకు మోదీని కలుస్తాం
హుస్నాబాద్: ఆయిల్‌పామ్ పంట క్వింటాలుకు రూ.25వేలు ఇవ్వాలని త్వరలోనే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రులతో కలిసి ప్రధాని మోదీని కలవనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. కోహెడ మండలం బస్వాపూర్‌లో మంగళవారం మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ క్వింటాల్‌కు రూ. 25 వేలు ఇవ్వాలని దేశానికి సరిపడా పామాయిల్ ఇస్తామని మోదీని కోరనున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ పంటలతో తెలంగాణ పచ్చబడాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 12లక్షల ఎకరాల ఆయిల్ పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు నిర్మాణ దశలో ఉన్నాయని, మరో 14 ఫ్యాక్టరీలు వస్తాయన్నారు. ఖమ్మం తర్వాత అత్యధిక ఆయిల్ ఫాం సాగు సిద్దిపేట జిల్లాలోనే జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు.