
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
గవర్నర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో జిల్లాలోని నాలుగు మండలాలకు చెందిన 415 మంది లబ్ధిదారులకు రెండో విడతగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ సొంత ఇల్లు అనేది గౌరవ సూచికమని, ఈ సువర్ణ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. ఇల్లు మంజూరై ఆర్థిక స్తోమత లేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, ఆయా మండలాల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కోహెడ(హుస్నాబాద్): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 17న కోహెడకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ హైమావతి హెలిప్యాడ్, సమావేశ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు స్టీల్ (డైనింగ్) సామగ్రి పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ రానున్నట్లు చెప్పారు. సమావేశానికి సుమారు 3,500 మంది మహిళలు హాజరుకానున్నారన్నారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో సమావేశం, గురుకుల పాఠశాల మైదానంలో హెలిప్యాడ్ కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా 282 మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రి అందజేస్తారన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్ గరీమా అగర్వాల్, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లనుపక్కాగా నిర్మించాలి
కలెక్టర్ హైమావతి

నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి