
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు ఆదేశాలు ● ప్రజావాణికి వచ్చిన అర్జీలు 253
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందిస్తున్న అర్జీలను వెంటవెంటనే పరిశీలిస్తూ పరిష్కారం దిశగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్‌హమీద్‌లతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రజావాణిపై నమ్మకం ఏర్పడేలా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. డీఆర్‌ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డబుల్‌సెంచరీ దాటిన అర్జీలు..
ప్రజావాణి అర్జీలపై ఎప్పటికప్పుడు కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అధికారులు అర్జీదారులకు ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే సంతోషం అర్జీదారుల్లో వ్యక్తమవుతోంది. ప్రజలు తండోపతండాలుగా కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలను అందిస్తున్నారు. దీంతో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఏకంగా 253 ధరఖాస్తులు వచ్చాయి.
గృహలక్ష్మి నిధులు మంజూరు చేయాలి
గృహలక్షీనిధులు మంజూరు చేయాలని నంగునూరు మండలం సిద్దన్నపేట వాసులు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పది మందికి గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఇళ్లు కట్టుకున్నప్పటికి నేటికి పథకానికి సంబంధించిన నిధులు రాలేవు. దీనికోసం ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికి ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అప్పులు తెచ్చి ఇళ్లుకట్టుకున్న మాకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
మా ఇళ్లు కూల్చొద్దు
మా ఇళ్లను కూల్చొద్దని దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి వాసులు కోరారు. అర్జీ సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ ఉన్న ఇంట్లోనే ఉంటూ బతుకులు వెళ్లదీస్తున్నామన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని రోడ్డు వెడల్పులో భాగంగా మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం అందించకుండా మార్కింగ్ వేశారన్నారు. ఉన్న ఇళ్లు మొత్తం పోయేలా మార్కింగ్ చేసి కూలిస్తే మా బతుకులు రోడ్డునపడతాయని వారు వాపోయారు. ఎలాగైనా అధికారులు స్పందించి మా ఇళ్లను కూల్చకుండా ప్రత్యామ్నాం చూడాలని కోరారు.
కేంద్ర బృందానికి వివరాలు అందించండి
సిద్దిపేటరూరల్: జిల్లా పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికారులు అందుబాటులో ఉండి వివిధ పథకాల వివరాలను క్షేత్రస్థాయిలో అందించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన పథకాల పరిశీలనకు వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు జోసెఫ్, వినోద్‌లతో కలెక్టర్ సమావేశమయ్యారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన వివిధ పనులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర బృందం అధికారులు ఈనెల 24వ తేదీ వరకు బెజ్జంకి, అక్కన్నపేట, కొమురవెల్లి మండలాలలో క్షేత్రస్థాయిలలో పర్యటించనున్నారన్నారు. ఉపాధిహమీ పనులు, పెన్షన్లు, వాటర్‌షెడ్, గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస్‌యోజన, గ్రామ పంచాయతీలు, ఆర్‌సేటి తదితర 12 రకాల పథకాల అమలును పరిశీలిస్తారన్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు అందుబాటులో వివరాలను అందించాలన్నారు.