
నాగేటి సాలల్లో.. నవతరం
● ఓ వైపు చదువుతూమరో వైపు ఎవుసంపై మక్కువ ● తల్లిదండ్రులకు ఆసరా
పత్తి పంటలో గొర్రు కొడుతున్న యువకులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): వ్యవసాయం తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వృత్తి.. కొందరు ఉన్నత స్థాయిలో ఉన్నా.. మక్కువతో సాగు చేస్తుండగా.. మరి కొందరు చదువుతూనే వ్యవసాయం చేస్తున్నారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు ఓ వైపు చదువుతూ మరో వైపు వ్యవసాయ పనుల్లో రాణిస్తూ మెలకువలు నేర్చుకుంటున్నారు. వ్యవసాయం రంగంలో యువత, విద్యార్థులు రాణిస్తున్నారు. నాగలి పట్టి దుక్కిదున్నడం. దంతె, గొర్రు కొట్టడం, మందు పిచికారీ చేయడం, ట్రాక్టర్ సహాయంతో పొలం దున్నడం, ఒడ్డు చెక్కడం, వ్యవసాయ మిషన్లతో కలుపు తీయడంలాంటి పనులు చేస్తున్నారు.
ఎమ్మెస్సీ చేస్తూ...
జగదేవ్‌పూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన ఉప్పల నరేష్ ప్రస్తుతం సిద్దిపేటలో ప్రతిభ కళాశాలలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో తమకున్న భూమితో పాటు మరింత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పంట చేతికందే వరకు ప్రతి పనిని తమ్ముడు రాజు (ఎమ్మెస్సీ ప్రథమ సంవత్సరం)తో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నారు.
వ్యవసాయంపై మక్కువతో..
మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన నర్సోల్ల నాగరాజు.. ప్రస్తుతం డిప్లొమా అగ్రికల్చరల్ చేస్తున్నారు. వ్యవసాయం కూడా చదువులో భాగమే అంటూ సాగు చేస్తున్నానని చెబుతున్నారు. సమయం కుదిరినప్పుడల్లా.. వ్యవసాయం పనులు చేయడం.. అమ్మానాన్నలకు ఆసరాగా నిలవడం సంతోషంగా ఉందని నాగరాజుతెలిపారు.
డిగ్రీ చేసి.. కూరగాయలు పండిస్తూ..
మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన నర్సింహులు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. ఎవుసం తాత ముత్తాల నుంచి వస్తున్న వృత్తి అని, వ్యవసాయం అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆదునిక పద్ధతులు నేర్చుకుని కూరగాయల పంటలను సాగు చేస్తున్నానని చెబుతున్నారు.

నాగేటి సాలల్లో.. నవతరం

నాగేటి సాలల్లో.. నవతరం

నాగేటి సాలల్లో.. నవతరం