
గ్రూపులొద్దు.. రచ్చకెక్కొద్దు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విబేధాలుంటే రచ్చకెక్కి మాట్లాడొద్దు.. ఏమైనా సమన్వయ సమస్య ఎదురైతే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి.. లేనిపక్షంలో టీపీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి.. అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల కీలక నాయకులతో సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల నియామకం తదితర అంశాలపై పొన్నం నేతలతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినెటేడ్, పార్టీ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పదవులతో పాటు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆయా పదవుల కోసం ఇచ్చిన జాబితాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి టీపీసీసీ, ఏఐసీసీ నాయకత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు రాజిరెడ్డి, టి.నర్సారెడ్డి, నాయకులు ఉప్పల శ్రీనివాస్‌గుప్త, మెట్టుసాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటుదాం
గజ్వేల్: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధించిన వివరాలను నర్సారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. ఏళ్ల తరబడి ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించగలుగుతున్నామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్నారు. కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.