
పని గంటల పెంపు తగదు
● కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి ● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య
గజ్వేల్: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్వర్యంలో బుధవారం గజ్వేల్‌లోని ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సందబోయిన ఎల్లయ్య మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో హరించి వేస్తున్నదని మండిపడ్డారు. 8గంటల పనివిధానం రద్దు చేసి, 12గంటల పని విధానం తీసుకురావడం, రాత్రి వేళల్లో మహిళలు పరిశ్రమల్లో పనిచేయాలని చెప్పడం దారుణమన్నా రు. హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్రం పోరాటం ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు శివలింగు కృష్ణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి, జిల్లా కమీటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.