పల్లెల్లోనూ స్టీల్‌ బ్యాంకులు | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లోనూ స్టీల్‌ బ్యాంకులు

Jul 9 2025 7:40 AM | Updated on Jul 9 2025 7:40 AM

పల్లెల్లోనూ స్టీల్‌ బ్యాంకులు

పల్లెల్లోనూ స్టీల్‌ బ్యాంకులు

ప్లాస్టిక్‌ నిర్మూలనే లక్ష్యం
● పొన్నం సత్తయ్య ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుకు సన్నాహాలు ● గ్రామాల్లో ప్లాస్టిక్‌ కట్టడికి మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి ● 85 గ్రామాల్లో రూ.1.27కోట్లతో ఏర్పాటుకు చర్యలు ● గవర్నర్‌ చేతుల మీదుగా సామగ్రి పంపిణీకి సన్నాహాలు

ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు పల్లెల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. తొలుత సిద్దిపేట మున్సిపాలిటీలో స్టీల్‌ బ్యాంకు పురుడు పోసుకుంది. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటుకు శ్రీకారం చూడుతున్నారు. అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్‌ తండ్రి పేరిట పొన్నం సత్తయ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో స్టీల్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్టీల్‌ బ్యాంక్‌లను కోహెడలో ప్రారంభించేందుకు రాష్ట్ర గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మ రానున్నారు. – సాక్షి, సిద్దిపేట

సిద్దిపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్‌రావు చొరవతో 34 వార్డులలో స్టీల్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. వివాహాలు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేలా దాతల సహకారంతో సిద్దిపేట మున్సిపాలిటీలో 2021లో స్టీల్‌బ్యాంకు పేరిట కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అవసరమయ్యే సామగ్రి మార్కెట్‌లో కన్నా తక్కువ అద్దెకే అందిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యత స్థానిక మహిళా సంఘాలకు అప్పగించారు. ఇలా ప్రారంభమైన స్టీల్‌ బ్యాంకు పల్లెల్లో సైతం చేరింది. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అతిథులు భోజనం చేసేందుకు స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మంత్రి నియోజకవర్గంలోనూ..

మంత్రి పొన్నం ప్రభాకర్‌ సైతం తన నియోజకవర్గంలోని గ్రామాల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించి అటు ప్రజల ఆరోగ్యంతో పాటు.. ఇటు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకనామిక్‌ సర్వే 2023–24 బుక్‌లెట్‌లో సిద్దిపేట స్టీల్‌ బ్యాంకుకు చోటు దక్కిన విషయం విదితమే.

85 గ్రామాల్లో..

హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని 85 గ్రామాల్లో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టీల్‌ బ్యాంకులో 500 భోజనం ప్లేట్లు, 250 టిఫిన్‌ ప్లేట్లు, 250 గ్లాస్‌లు, 250 టీ గ్లాస్‌లు, డిష్‌లు, బకెట్లు, గంటెలు ఉండనున్నాయి. రూ.1.27కోట్లతో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారు. గ్రామైక్య మహిళా సంఘాలు వీటి నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి.

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు..

ప్లాస్టిక్‌ ప్లేట్లలో భోజనం చేయడం, ప్లాస్టిక్‌ గ్లాస్‌లలో నీటిని, టీ తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే పర్యావరణానికి హానీ కలగనుంది. మంత్రి పొన్నం చొరవతో స్టీల్‌ బ్యాంక్‌ ఏర్పాటు కానుండటంతో పర్యావరణ రక్షణతో పాటు ప్రజల ఆరోగ్యానికి మేలు కలగనుంది. ఈనెల 23న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా గ్రామైక్య సంఘాలకు స్టీల్‌ సామగ్రి అందించనున్నారు.

23న కోహెడకు గవర్నర్‌ రాక

కోహెడ(హుస్నాబాద్‌): రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఈ నెల 23న కోహెడకు రానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ హైమావతి హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గవర్నర్‌ కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక లక్ష్మి గార్డెన్‌ సమీపంలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందన్నారు. గవర్నర్‌ కార్యక్రమం రోజున వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. హుస్నాబాద్‌ నియోజక వర్గం వ్యాప్తంగా 282 మహిళా సంఘాలకు గవర్నర్‌ చేతుల మీదుగా స్టిల్‌ సామగ్రి అందజేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement