
ఇందిరమ్మ ఇళ్లను వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం
చిన్నకోడూరు(సిద్దిపేట): ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అధికారులను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం గంగాపూర్‌లో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు ముగ్గు పోసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా టోకెన్లు అందించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేని నిరుపేదలకు ఐకేపీ ద్వారా అందించాలని డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్యకు సూచించారు. అలాగే రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను కలెక్టర్ సందర్శించారు. పంప్‌హౌస్, టన్నెల్‌ను పరిశీలించారు. డీఈ చంద్రశేఖర్ పంప్ హౌస్ విభాగాలు, మోటార్లు, పంపింగ్ విధానాన్ని కలెక్టర్‌కు వివరించారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
చంద్లాపూర్ శివారులోని వెటర్నరీ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి రక్షించడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతామన్నారు. మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ సీరియస్
కోహెడరూరల్(హుస్నాబాద్): ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు. కోహెడ మండలంలో పర్యటిస్తున్న కలెక్టర్.. ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్‌ను గమనించి విచారించారు. ఎలాంటి అనుమతి లేకపోవడంతో ఎందుకు నిఘా పెట్టడంలేదని రెవెన్యూ అధికారులపై మండి పడ్డారు. అలాగే పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ యజమానికి పనిష్మెంట్ విధించారు. పది ట్రిప్పుల ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా అందించాలని ఆదేశించారు. ఆనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని ఆడ్డుకోవాలని సూచించారు.