
కేసుల ఛేదనతోనే గుర్తింపు
పోలీస్ కమిషనర్ అనురాధ
గజ్వేల్‌రూరల్: కేసుల ఛేదనతోనే పోలీసులకు గుర్తింపు లభిస్తుందని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏసీపీ నర్సింహులుతో పాటు సీఐలు సైదా, ముత్యంరాజు, క్రైమ్ వర్టికల్, ఐటీసెల్ సిబ్బంది ఏఎస్‌ఐ యాదగిరి, కానిస్టేబుళ్లు నరేందర్, వెంకటేష్, రవి, దివ్య, శ్రీకాంత్, రమేష్, సురేందర్, హోంగార్డ్ నగేష్‌లకు రివార్డును అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించేందుకు రివార్డు, అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు.
చంద్లాపూర్‌లో
తమిళనాడు బృందం
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్‌ను తమిళనాడు రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామానికి రాష్ట్ర స్థాయి టూరిజం అవార్డు రావడానికి చేపట్టిన కార్యక్రమాలపై ఆరాతీశారు. గ్రామంలోని ఆయిల్‌పామ్ నర్సరీని సందర్శించారు. గ్రామంలో పండించే పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి ప్రజల స్థితిగ తులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఓ దేవకిదేవీ తదితరులు పాల్గొన్నారు.
సంక్షోభంలో కార్మిక రంగం
ప్రజా సంఘాల రాష్ట్రకన్వీనర్ సంతోష్
దుబ్బాక: కేంద్ర ప్రభుత్వం ఓ వైపు సబ్‌కా సాత్, సబ్ కా వికాస్ అంటూనే శ్రామికుల నోట్లో మట్టి కొడుతోందని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ వంగల సంతోష్ అన్నారు. మంగళవారం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో కార్మిక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఉద్యమంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచేలా కేంద్రం అమల్లోకి తీసుకువస్తోందన్నారు.నాలుగులేబర్ కోడ్‌లతో కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.
కలెక్టర్‌పై చర్య తీసుకోండి
చేర్యాల(సిద్దిపేట): కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి సీఎస్‌కు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల చేర్యాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన నాయకులను ప్రోత్సహించడమేకాకుండా వారు పాల్గొనేలా వ్యవహరించిన కలెక్టర్ తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు తెలిపారు.
బీజేపీలోకి
మున్సిపల్ మాజీ చైర్మన్!
గజ్వేల్: మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సమక్షంలో బుధవారం కాషాయకండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ ను వీడీ బీజేపీలో చేరబోతున్నారనే వార్తలను నిజం చేస్తూ తన అనుచరులతో కలిసి పార్టీ కార్యాలయానికి తరలివెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2024 ఏప్రిల్‌లో జరిగిన మెదక్ ఎంపీ ఎన్నికల సందర్భంగా బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. భాస్కర్ పార్టీని వీడుతుండటంతో అధికార పార్టీకి షాక్ తగలనుంది.
మాలలకు తీరని అన్యాయం
దుబ్బాక: ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతోందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర పొలిట్‌బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన రోస్టర్ విధానాన్ని సవరించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు.

కేసుల ఛేదనతోనే గుర్తింపు