
సివిల్స్‌కు ఉచిత శిక్షణ
సిద్దిపేట ఎడ్యుకేషన్: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌కు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సిద్దిపేట వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ లు తెలిపారు. ఉచిత సివిల్స్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం సిద్దిపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ కళాశాల ఆవరణలో ఆవిష్కరించి మాట్లాడారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు జూలై 7 లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 13 న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఎస్సీ లకు 75, ఎస్టీలకు 10 , బీసీలకు 15 శాతం సీట్లు, ఇందులో మహిళలకు 33 శాతం, పీడబ్ల్యూడీ వారికి 5 శాతం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించరాదన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నరేష్, మహేష్, రవికిరణ్, రాజేష్, సంజీవ్, వెంకటేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
కరపత్రాల ఆవిష్కరణ