● ఫైరింజన్‌తో మంటలార్పిన సిబ్బంది ● ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ
హవేళిఘణాపూర్(మెదక్): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని తూకం వేసిన వరిధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలం పేరూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన రైతు సిద్ధిరాములుకు చెందిన 105 వరిధాన్యం బస్తాలను రెండు రోజుల క్రితం తూకం వేశారు. లారీ రాకపోవడంతో అలాగే టార్పాలిన్లు కప్పి ఉంచారు. ఈ క్రమంలో చుట్టుపక్కల రైతులు వరికొయ్యలు తగులబెట్టేందుకు నిప్పంటించడంతో గాలికి తూకం వేసిన బస్తాలకు నిప్పంటుకుంది. దీనిని గమనించిన రైతులు వెంటనే ఫైరింజన్‌కు సమాచారం అందించగా సకాలంలో వచ్చి మంటలార్పారు. ఈ ప్రమాదంలో దాదాపు 25బస్తాల ధాన్యం కాలిపోయింది. ఘటనా స్థలాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ఆర్‌ఐ కిశోర్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు ధాన్యంను వెంటనే తరలించేలా చూడాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు.


