ఫ్రిడ్జ్‌, ఏసీ రిపేర్‌లో ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఫ్రిడ్జ్‌, ఏసీ రిపేర్‌లో ఉచిత శిక్షణ

Apr 6 2026 8:42 AM | Updated on Apr 6 2026 8:42 AM

ఫ్రిడ్జ్‌, ఏసీ రిపేర్‌లో ఉచిత శిక్షణ 29 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత ఇసుక ట్రాక్టర్ల పట్టివేత చెరువులో వ్యక్తి గల్లంతు వృద్ధుడు అదృశ్యం రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

సంగారెడ్డి టౌన్‌: గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఫ్రిడ్జ్‌, ఏసీ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్టు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ రాజేశ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల గ్రామీణ యువతకు నేటి నుంచి నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గలవారు 94901 03390 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం రిపేరింగ్‌ కిట్లు ఇస్తారని, అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

తూప్రాన్‌: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఎస్‌ఐ గంగరాజు వివరాల ప్రకారం.. రేషన్‌ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు లారీలో అక్రమంగా తరలిస్తున్న 29 టన్నుల రేషన్‌ బియ్యంను పట్టుకున్నారు. ఈమేరకు లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. లారీని సివిల్‌ సప్లయి అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మద్దూరు(హుస్నాబాద్‌): దూల్మిట్ట మండలంలోని జాలపల్లిలోని మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ మహ్మద్‌ ఆసీఫ్‌ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జుక్కల నరేశ్‌, మెతుకు రమణ వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని అనుమతి పత్రాలను అడిగారు. వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

శివ్వంపేట(నర్సాపూర్‌): చెరువులో వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం... మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల భయాన గ్రామానికి చెందిన సయ్యద్‌ ముజాహిద్‌ శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెతుకుతుండగా చెరువు కట్టపై అతడి దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్‌ కనిపించాయి. దీంతో నర్సాపూర్‌ ఆగ్నిమాపక సిబ్బంది ఆదివారం చెరువులో గాలింపు చేపట్టారు.

సంగారెడ్డి క్రైమ్‌: వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. పట్టణంలోని వీరభద్రనగర్‌ కాలనీకి చెందిన అక్కంగారి బక్కయ్యగౌడ్‌ (75), ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి. కాగా తన కూతురు, అల్లుడు కుటుంబంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా పట్టణంలోనే జీవిస్తున్నాడు. గత నెల 22న ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు పక్కల, తెలిసిన బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం రామాయంపేట మండలం ల క్ష్మాపూర్‌కు చెందిన కుమ్మరి బాబు తన మేనేత్త నాగోల్ల సత్తమ్మను బైక్‌పై ఎక్కించుకుని నార్సింగి నుంచి రామాయంపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో జప్తిశివనూర్‌ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ పెట్రోల్‌ పోయించుకొని రాంగ్‌రూట్‌లో వస్తూ బైక్‌ను ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వారిని వెంటనే అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement