వాతావరణ మార్పులతో ఆందోళన
● అకాల వర్షాలు పడితే పంటలు ఆగమే
● కోత దశలో వరి పంట
● ఇప్పటికే గాలివాన, వడగళ్లతో నష్టం
దుబ్బాక: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారైంది రైతుల పరిస్థితి. ఇప్పటికే నెల రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సానికి జిల్లాలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈ దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ పుండుమీద కారం చల్లినట్లు వాతావరణంలో మార్పులు రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గాలివానతో కూడిన వర్షాలు, వడగళ్లు పడుతాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అన్నదాతలు కలవరం చెందుతున్నారు. శనివారం రాత్రి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గాలిదుమారంతో పాటు జల్లులు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వడగళ్లు పడుతాయ న్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వడగళ్లు పడితే ఆగమే..
జిల్లాలో 80 శాతానికి పైగా వరిపంటలు కోతదశలో ఉన్నాయి. మరో 20 రోజులైతే కోతలు మొదలవుతాయి. ఇంకా 20 శాతం పంట పొట్ట దశలో, ఈని గింజలు ఎర్రబడటం, పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జిల్లాలో ఈ యాసంగిలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఇందులో 3.53 లక్షల ఎకరాల్లో వరి వేశారు. జిల్లాలో మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ జలశయాల్లో సంమృద్ధిగా నీరు ఉండటంతో పెద్ద ఎత్తున సాగు చేశారు. రైతులు లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేయగా... తీరా చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండటంతో పరేషాన్ అవుతున్నారు. దీంతో ఆకాశం వైపు చూస్తూ దిగులు చెందుతున్నారు.
ఇప్పటికే పంటలకు నష్టం
ఇప్పటికే నెల రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సానికి జిల్లాలోని దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, రాయపోల్, దౌల్తాబాద్, కొండపాక, అక్బర్‌పేట–భూంపల్లి, చిన్నకోడూర్, నంగునూర్, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్‌తో పాటు చాలా మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పంటలకు నష్టం వాటిల్లింది. పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, బీర్నీస్, కూరగాయలు, మామిడి తోటలకు భారీగా నష్టం ఏర్పడింది.


