దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో మహిళకు సోమవారం అరుదైన ఆపరేషన్ చేశారు. వివరాలు ఇలా... కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన రత్నగారి లత సంవత్సరం నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తగ్గకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆమె దుబ్బాక ఆస్పత్రికి వెళ్లింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను సూపరింటెండెంట్, డాక్టర్ హేమరాజ్‌సింగ్ పరీక్షించి కడుపులో మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నట్లు గుర్తించారు. రక్తం తక్కువగా ఉండటంతో 3 యూనిట్ల రక్తం ఎక్కించి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసి కడుపులోంచి 7.1కిలోల గడ్డలను తొలగించారు. ప్రస్తుతం లత ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రాణాలు కాపాడిన డా.హేమరాజ్ సింగ్, వైద్యులు రాఘవేందర్ ,శ్రేయ, సనందను అభినందించారు.


