సిద్దిపేటరూరల్: కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ములుగు మండలం కొక్కొండ గ్రామంలో నాయీబ్రాహ్మణుల బొందల గడ్డను కబ్జా చేస్తూ కులం పేరుతో దూషించారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్ ఏఓకు ఆ సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు యాద నరేందర్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణుల బొందలగడ్డను కబ్జాను అడ్డుకుంటే కులంపేరుతో దూషిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మల్లేశ్, రవి, ఆంజనేయులు, నరేశ్, నవీన్, క్రాంతికుమార్, వినోద తదితరులు పాల్గొన్నారు.
డీఎల్‌పీఓ విచారణ
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని గూడూర్ గ్రామ పంచాయతీలో సోమవారం డీఎల్‌పీఓ యాదయ్య విచారణ చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందిన వార్డు సభ్యుడు గొల్ల యాదయ్యపై ఓడిపోయిన అభ్యర్థి శ్రీకాంత్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కాగా సివిల్ కాంట్రాక్టర్‌గా యాదయ్య పోటీ చేయడం ఎన్నికల నిబంధలనకు వ్యతిరేకమన్న ఫిర్యాదు మేరకు సోమవారం డీఎల్‌పీఓ గ్రామ పంచాయతీలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి నివేదిక జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, ఎంపీఓ తిరుపతిరెడ్డి ఉన్నారు.
గాలికుంటు
టీకాలు వేయించాలి
జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య
కౌడిపల్లి(నర్సాపూర్): పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. సోమవారం మండలంలోని తునికిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి తగ్గి రైతులకు ఆర్థికంగా నష్టం వస్తుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ రామకృష్ణ, వైద్యసిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
గ్యాస్ కొరతను
పరిష్కరించాలి
గజ్వేల్‌రూరల్: యుద్ధం సాకుతో గ్యాస్ ధరలు పెంచవద్దని, ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణ, రాజేశం మాట్లాడుతూ యుద్ధం వల్ల మన దేశంలో ఆయిల్ కొరత ఏర్పడటంతో గ్యాస్‌కు ఇబ్బంది జరుగుతున్నట్లు ప్రభుత్వమే చెబుతున్నదన్నారు. గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్రమోడీ అమెరికాపై ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శ్రీను, చంద్రం, శంకరయ్య, నర్సింలు, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
వాహనం ఢీకొని
మహిళకు గాయాలు
నిజాంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కల్వకుంట క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా... నార్లాపూర్ గ్రామానికి చెందిన గాళం సంతోషకు కల్వకుంట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రాథమిక చికిత్సచేసి అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలించారు.


