సిద్దిపేటఎడ్యుకేషన్: తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఐదు దశాబ్దాలుగా సాహితీ రంగంలో అలుపెరుగని సేవచేస్తూ సాంస్కృతిక పునరుజ్జీవంలో జీవరేఖగా నిలిచాడని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి అన్నారు. విశ్రాంత అధ్యాపకులు సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సోమవారం కళాశాల తెలుగు విభాగం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిధారెడ్డి సిద్దిపేట గడ్డకు గర్వకారణమన్నారు. సాంస్కృతిక వారసత్వపు బిడ్డగా, కవిగా, రచయితగా, పరిశోధకుడిగా అనేక సేవలను అందించారన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబిస్తూ ఆయన రచించిన అనిమేష కవితా సంపుటికి పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. అధ్యాపకులు పిట్లదాసు, నారోజు వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ జీవితాన్ని అక్షరీకరించిన కలానికి దక్కిన గౌరవమని కొనియాడారు.
సిధారెడ్డికి అభినందనలు : జిల్లా కవులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేటకు చెందిన డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం గర్వకారణమని, జిల్లా కవులు సోమవారం పేర్కొన్నారు. అవార్డుకు ఎంపికవ్వడంపై సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్, మంజీర రచయితల సంఘం, శ్రీవాణి సాహిత్య పరిషత్, సుగుణ సాహితీ సమితి, అక్షర సేద్యం ఫౌండేషన్, సిద్దిపేట రచయితల సంఘాలకు చెందిన కవులతో పాటు వివిధ కవులు నందిని సిధారెడ్డికి అభినందనలు తెలిపారు.
సాంస్కృతిక పునరుజ్జీవంలో జీవరేఖ


