సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి వివరాల ప్రకారం... ఆదివారం అర్ధరాత్రి పట్టణంలో తదితర చోట్ల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి ఒకరికి రూ.1500, ఆరు మందికి రూ.1000 చొప్పున జరిమాన విధించారు.
నిందితుడికి 20 ఏళ్ల జైలు
మెదక్ కలెక్టరేట్: చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అటెండర్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని రేగోడ్ మండలంలో ఓ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న సారా జైపాల్(25) అదే పాఠశాలలో చదువుతున్న చిన్నారిపై 2019 జూన్‌లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. సోమవారం మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
అప్పుల బాధతోరైతు ఆత్మహత్య
దుబ్బాకరూరల్: అప్పులు తీర్చలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రఘోత్తంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్ల దేవిరెడ్డి(70) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నేళ్ల నుంచి దేవిరెడ్డికి అతని సోదరుల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. ఏడాది క్రితం దేవిరెడ్డి అప్పులు చేసి తన కుమారుడి వివాహం చేశాడు. అయితే అప్పులు తీర్చడానికి భూమిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కాగా భూమి విషయంలో గొడవల కారణంగా వివాదం పరిష్కారం కాలేదు. ఇటు వివాదం పరిష్కారం కాక, చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.


