మొగులు.. గుబులు | - | Sakshi
Sakshi News home page

మొగులు.. గుబులు

Mar 17 2026 8:44 AM | Updated on Mar 17 2026 8:44 AM

భయపెడుతున్న అకాల వర్షాలు

వాతావరణ మార్పులతో

రైతుల్లో కలవరం

పాలు పోసుకునే దశలో వరిచేలు

జహీరాబాద్‌లో..

కన్‌సాన్‌పల్లిలో కురిసిన వడగళ్లు

దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి గాలిదుమారంతో పాటు చిరు జల్లులు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వడగళ్లు పడుతాయన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే పంటలకు తీవ్ర నష్టం

20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలోని వివిధ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, బీర్నీస్‌, కూరగాయ, మామిడి తోటలకు భారీగా నష్టం ఏర్పడింది. ఆ నష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కలవరపాటుకు గురవుతున్నారు.

అందోల్‌, జహీరాబాద్‌లో వడగళ్లు

వట్‌పల్లి(అందోల్‌)/జహీరాబాద్‌టౌన్‌: అందోల్‌ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి, రాంసాన్‌పల్లి, నేరడిగుంట తదితర గ్రామాల్లో జహీరాబాద్‌ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వడగళ్ల వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు ఎండ కాచి సాయంత్రానికి వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఇంటి వాకిలిలో పడ్డ వడగండ్లను కొంతమంది ఏరుకుని తిన్నారు. నీళ్లు ఇంకిన బోరుబావులకు, వాడిపోతున్న వరి పంటకు ఈ వర్షం మేలు చేకూర్చగా..ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఇక వడగళ్ల వానకు మామిడి కాత నేలరాలింది. గత 15 రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ఆయా గ్రామాల ప్రజానీకానికి ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

ఖేడ్‌లో ఈదురుగాలులతో వర్షం

నారాయణఖేడ్‌:ఖేడ్‌ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. కురిసిన వర్షం మనూరులో 24.2 మి.మీలు, సిర్గాపూర్‌లో1.8, ఖేడ్‌, నాగల్‌గిద్దలో 0.8 మి.మీల చొప్పున, కంగ్జిలో 0.4 మి.మీలుగా నమోదైంది. బలంగా వీచిన ఈదురు గాలులకు సిర్గాపూర్‌ మండలం చందర్‌ నాయక్‌ తండా పంచాయతీ పరిధి లోని వాలునాయక్‌ తండాలో శంకర్‌కు సంబంధించిన రేకుల ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో కుటుంబీకులు నిరాశ్రయులయ్యారు. సర్పంచ్‌ రుక్మిణిపూల్‌సింగ్‌, పంచాయతీ కార్యదర్శి రఫీక్‌ ఇంటిని సందర్శించారు. నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి పరిహారం అందించేలా కృషి చేస్తామని సర్పంచ్‌ హామీనిచ్చారు. గాలులకు ఖేడ్‌ డివిజన్‌ పరిధిలోని పలుచోట్ల మామిడి కాయలు రాలిపడటంతో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.

పొట్టకొచ్చిన వరి

జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో ఈయాసంగిలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇందులో 3.53 లక్షల ఎకరాల్లో వరిని వేశారు. జిల్లాలో మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ జలశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు వరి సాగు చేశారు. రైతులు రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, తీరా చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement