సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి 57 అర్జీలు వచ్చినట్లు అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి హాజరైన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమాహారతి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పాండు ఆదేశించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ఉమాహారతి తదితరులు పాల్గొన్నారు.
ఖేడ్‌లో ఇఫ్తార్ విందు
నారాయణఖేడ్: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఖేడ్‌లో ప్రభుత్వపరంగా ముస్లింలకు రెహమాన్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, తహశీల్దార్ హసీనాబేగమ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రషీద్, తాహెర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముంతాజ్, నాయకులు వినోద్‌పాటిల్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, రాజు, సుబూర్, మహేశ్, లక్ష్మణ్, నాయకులు పండరీరెడ్డి, మైనొద్దీన్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
కోదండ రామాలయ ఉత్సవ కమిటీ నియామకం
జిన్నారం(పటాన్‌చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో రానున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రకటించారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఎర్రంతగారి ఆంజనేయులు యాదవ్, సభ్యులుగా చేరికారి గోవర్ధన్‌రెడ్డి, గోకర్ వెంకటేశంగౌడ్, లక్ష్మీ సంజీవ, అర్చకులు లక్ష్మణాచార్యులు నియామకమయ్యారు. పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ తన నివాసంలో ఉత్సవ కమిటీ నియామక పత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు. నూతన కమిటీని ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, పుట్టా నర్సింగరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాతృమూర్తికి హరీశ్‌రావు పరామర్శ
పటాన్‌చెరు: కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ఎమ్మెల్యే గూడెం మహి పాల్‌రెడ్డి మాతృమూర్తి గూడెం మాణెమ్మని సోమ వారం ఉదయం మాజీమంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హరీశ్‌రావుతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యేతోపాటు వారి కుటుంబ సభ్యులకు హరీశ్‌రావు సూచించారు.


